ఆదివారం అంతే మరి!

29 Jul, 2019 13:08 IST|Sakshi
కొడవలూరు పీహెచ్‌సీ మూతపడి ఉండటంతో వైద్యం కోసం వచ్చి వెనుదిరుగుతున్న వృద్ధురాలు 

కొడవలూరు పీహెచ్‌సీలో కానరాని వైద్యులు, సిబ్బంది

వైద్యం కోసం వచ్చి వెనుదిరిగిన రోగులు

సాక్షి, కొడవలూరు: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ తలుపులు ఆదివారం తెరచుకోలేదు. ఫలితంగా కుక్క కాటుకు గురైన బాలుడితో సహా పలువురు రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కొడవలూరు మండల కేంద్రంలో పీహెచ్‌సీకి రోజూ 20 నుంచి 30 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుంటారు. ఏదైనా అత్యవసరమైనా ప్రాథమిక చికిత్సకు ఇక్కడకే వస్తారు. నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడంలేదు.

తెరచుకోని పీహెచ్‌సీ 
ఆదివారం కూడా పీహెచ్‌సీలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్ట్, ఆయాలు విధిగా ఉండాలి. ఆస్పతికి వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వాలి. ఆదివారం పీహెచ్‌సీకి సిబ్బంది రాకపోవడంతో పూర్తిగా మూత పడింది. ఫలితంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. పద్మనాభసత్రానికి చెందిన మూడేళ్ల బాలుడు రామలింగం మహేష్‌ను ఆదివారం కుక్క కరవడంతో వైద్యంకోసం తండ్రి సురేష్‌ ఉదయం 11 గంటలకు పీహెచ్‌సీకి వచ్చారు. పీహెచ్‌సీ తలుపులు  తెరచుకోకపోవడంతోపాటు సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ లేరు. దీంతో నార్త్‌రాజుపాళెంలోని ప్రైవ్రేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. పాము కాటైనా పరిస్ధితి ఇంతేనా అంటూ బాలుడి తండ్రి సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు వృద్ధులు పీహెచ్‌సీకి వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు.

ఎమ్మెల్యే హెచ్చరించినా..
విడవలూరు మండలం ఊటుకూరులో ఇటీవల బోరు బావిలో బాలుడు పడిపోగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దగ్గరుండి బాలుడ్ని వెలికి తీయించి రామతీర్థం వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని కోవూరు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు.

మరిన్ని వార్తలు