దీనులంటే లెక్కలేదు!

22 Aug, 2019 08:50 IST|Sakshi
గాయపడిన బాధితుడిని అతని స్నేహితులు ఆస్పత్రిలోకి తీసుకెళుతున్న దృశ్యం (ఫైల్‌)

సాక్షి, చీరాల: దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్మారక 100 పడకల చీరాల ప్రభుత్వాసుత్రిలో చికిత్సలు పొందే రోగులకు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలు సక్రమంగా అందించడంలేదనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. వారిపై ఉన్న ఆరోపణలు అటుంచితే వివిధ ప్రమాదాల బారినపడి ఆస్పత్రిలో చికిత్సలు పొందుదామని వచ్చే క్షతగాత్రులకు, నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కనీసం స్టెచ్చర్లు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ సూరినేని ఉష గత మంగళవారం వైద్యలను, వైద్య సిబ్బందిని వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ఆస్పత్రిలో విచారణ చేస్తున్న సమయంలో కూడా ఆస్పత్రికి వచ్చిన బాధితులను సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇటువంటి సంఘటనలు నిత్యం ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నా స్పందించే అధికారులు లేకపోవడం శోచనీయం. చీరాలకు చెందిన శంకర్‌ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బ తగిలింది. తన బంధువుల సాయంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుదామని గత మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. అతడు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లే సమయంలో నేలపై దోకుతూ లోపలికి వెళ్లాడు. అతని పరిస్థితిని చూసిన ఆస్పత్రి సిబ్బంది కనీసం అతనికి స్టెచ్చర్‌ కానీ వీల్‌ చైర్‌ కానీ అందించలేదు. అతడు ఆస్పత్రిలోకి వెళ్లి కాలికి కట్టు కట్టించుకున్న అనంతరం లోపలికి ఏవిధంగా అయితే వెళ్లాడో బయటకు కూడా నేలపై దేకుతూ అదే విధంగా వచ్చాడు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారిణి డాక్టర్‌ ఉష అదే ఆస్పత్రిలో వార్డులను తనిఖీలు చేసి వైద్య సేవలపై వైద్యులను విచారిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది.

మరోవ్యక్తిని కూడా...
స్థానిక హైమా ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సు డోరు తగిలి పాత చీరాల గేటు సమీపంలో నివాసముండే సుద్దపల్లి సాయి అనేవ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. అయితే బాధితుణ్ణి అతని స్నేహితులు చికిత్స నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితుణ్ణి ఆటోలో తీసుకొచ్చిన అతని స్నేహితులే అచేతనంగా.. రక్త గాయాలతో ఉన్న బాధితుణ్ణి ఆ ఇద్దరు స్నేహితులు బాధితుడి కాళ్లు, చేతులు పట్టుకొని అతి కష్టం మీదు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి బెడ్‌పై పడుకోపెట్టారు. ఆ తర్వాతే సిబ్బంది బాధితుడి వద్దకు చేరి హడావుడిగా చికిత్సలు అందించారు.

మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించడంతో అంబులెన్స్‌ కోసం బాధితుని తల్లి రత్న కుమారి పడరాని పాట్లు పడింది. చాలా సేపటి వరకు అంబులెన్స్‌ దొరకకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె వైద్య సిబ్బందిని విచారణ చేస్తున్న  జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ కర్త డాక్టర్‌ ఉష వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆస్పత్రిలో అంబులెన్స్‌ సౌకర్యం లేదని ఉన్న అంబులెన్స్‌ కూడా పూర్తిగా పాడై పోయిందని, డ్రైవర్‌ కూడా లేడని డాక్టర్‌ ఉష బాధితుని తల్లి రత్న కుమారికి చెప్పడం విశేషం.

నిరుపేదలు ఎక్కువగా చికిత్స పొందే ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడం దారుణమని బాధితుని తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. అయితే ఆస్పత్రి ఆవరణలో నిత్యం ఉండే 108 అంబులెన్స్‌ కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని ఒంగోలు ఆస్పత్రిలో చేర్చేందు వెళ్లిందని సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్‌ ఉష ఆస్పత్రి పర్యవేక్షకుని పిలిచి వివరణ తీసుకున్నారు. ప్రతినెలా ఎన్ని కేసులు ఒంగోలు పంపుతున్నారని ప్రశ్నించారు. అయితే ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా చీరాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు.

మరిన్ని వార్తలు