‘సర్వ’జన కష్టాలు

26 Apr, 2019 11:14 IST|Sakshi
నారమ్మను ఎఫ్‌ఎం వార్డుకు తీసుకెళ్తున్న కొడుకు, అల్లుడు

రోగుల బంధువులే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు

ఇదీ సర్వజనాస్పత్రిలో దుస్థితి

అనంతపురం న్యూసిటీ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రిలోని పలు వార్డుల్లో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. స్కాన్, ఎక్స్‌రేలు, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచర్‌ ఉండదు. ఒక వేళ స్ట్రెచర్‌ ఉంటే రోగి సహాయకులు ఉండరు. దీంతో రోగుల బంధువులే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలుగా మారాల్సి వస్తోంది.

హిందూపురం ఆరుమాకులపల్లికి చెందిన నారమ్మ అనే వృద్ధురాలును ఎఫ్‌ఎం వార్డులో అడ్మిషన్‌ చేయాల్సి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలికి వైద్యులు స్కాన్‌కు రెఫర్‌ చేశారు.  కొడుకు గోవిందు, అల్లుడు నరసింహ, ఇతర కుటుంబీకులు ఉదయం 9.45 నుంచి వార్డులో స్ట్రెచర్, వీల్‌ చైర్‌ కోసం ఎదురుచూశారు. రోగి సహాయకులు లేకపోవడంతో చివరకు ఈ ముగ్గురే వృద్ధురాలిని వార్డు నుంచి స్ట్రెచర్‌పై స్కాన్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఉదయం 11.25 గంటలకు స్కాన్‌ పూర్తయ్యింది.  తిరిగి ఆ వృద్ధురాలిని వార్డుకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఆస్పత్రిలో ఏ వార్డు ఎటువైపు ఉందో తెలియని పరిస్థితి. ఎఫ్‌ఎం వార్డులో తీసుకెళ్లేది పోయి ఓపీ నంబర్‌ 3కి తీసుకెళ్లారు. వార్డు ఎక్కడుందని అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి.   చివరకు 12 గంటల సమయంలో అక్కడే ఉన్న రోగులు సమాచారం ఇవ్వడంతో వారు అతికష్టం మీద వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో నిత్యం ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నా..యాజమాన్యం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా మేలుకొని వార్డుల్లో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను అందుబాటులో ఉంచి సేవలందించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు