రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఔషధ తయారీ కంపెనీలు

6 Jul, 2013 11:47 IST|Sakshi
రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఔషధ తయారీ కంపెనీలు

- ఔషధాలకు నాణ్యత పరీక్షలు పూజ్యం
- ఆషామాషీగా ప్రభుత్వాస్పత్రులకు పంపిణీ
- గుండెపోటు, రక్తపోటు మాత్రల్లో నాణ్యత నాస్తి
- యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్‌దీ ఇదే తీరు
- లక్ష బ్యాచ్‌లలో 10 వేల బ్యాచ్‌లకే పరీక్షలు
- 20 రకాల మందులు నాసిరకమని నిర్ధారణ
- అప్పటికే వాటిని రోగులతో మింగించిన ఆస్పత్రులు
- వ్యాధి నయం కాకపోగా కొత్త రోగాలతో కుదేలు
- లివర్, కిడ్నీలకు పెను ప్రమాదమంటున్న వైద్యులు
- పట్టించుకున్న పాపాన పోని రాష్ట్ర ప్రభుత్వం
- తమిళనాడును చూసైనా పాఠాలు నేర్వని వైనం

పారాసెటమల్ ఐపీ 500:
రాష్ట్రంలో రోజుకు 20 లక్షల మంది రోగులు వాడే ఈ మాత్రలు 2011 ఆగస్ట్‌లో తయారైన వెంటనే ఆస్పత్రులకు వెళ్తే, వాటి నాణ్యత డొల్ల అని 2012 నవంబర్‌లో బయట పడింది!

గ్లిజరైల్ ట్రై నైట్రేట్:
గుండెపోటు రాగానే తక్షణం వేయాల్సిన ఈ మాత్రలు 2012 మార్చిలో తయారైన తక్షణమే ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే, అవినాసిరకపువని 2012 జూలైలో తేల్చారు. ఆలోగా వాటన్నింటినీ రోగులకు సరఫరా చేసేశారు!

సాక్షి, హైదరాబాద్: ఔషధ తయారీ కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యత లేని నాసిరకపు మందులను సర్కారీ ఆస్పత్రులకు అంటగడుతున్నాయి. అభాగ్య రోగులతో డొల్ల మందులను మింగిస్తున్నాయి. అవి వారి వ్యాధులను నయం చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన ఆర్నెల్లకో, ఏడాదికో సదరు మందుల నాణ్యత పరీక్షల ఫలితాలు బయటికి వస్తున్నాయి. అవి నాసిరకపువని అప్పుడు నింపాదిగా తేలుతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కంపెనీల పేరాశ, ప్రభుత్వ అలసత్వం లక్షలాది మంది రోగుల ప్రాణాలను గాల్లో దీపంగా మార్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులకు సుమారు 400 రకాల పైగా మందులు సరఫరా అవుతున్నాయి. వాటికి సకాలంలో నాణ్యతా పరీక్షలు జరిపి, అవి మంచివేనని తేలాకే సరఫరా చేయాలన్న కనీస కర్తవ్యాన్ని పాటించడం లేదు. ఏ మందు మింగితే ఎలాంటి కొత్త రోగం వస్తుందో తెలియక రోగులు సతమతమవుతున్న తీరు బాధాకరం. మచ్చుకు కొన్ని ఉదంతాల్ని చూస్తే...

గ్లిజరైల్ ట్రై నైట్రేట్: గుండెపోటు రాగానే తక్షణం వేయాల్సిన మాత్రలు ఇవి. రోగి ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే ఇవి క్షణాల్లో శరీరంపై పనిచేయాలి. 2012 మార్చిలో తయారైన ఈ మందులు తక్షణమే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిపోయాయి. కానీ అవినాసిరకపువని 2012 జూలైలో తేల్చారు. ఆలోగా ఆ బ్యాచ్‌కు చెందిన మందులన్నింటినీ రోగులకు ఇవ్వడం, వారు వాడేయడం జరిగిపోయాయి! మరి వాటి ని మింగాక కూడా వారిలో ఎందరు గుండెపోటుకు బలై ఉంటారో!

నియోస్టిగ్మైన్ ఇంజెక్షన్: రక్తపోటు బాగా పడిపోయినప్పుడు ఇస్తారు. ఇవి 2011 నవంబర్‌లో ఆస్పత్రులకు సరఫరా అయితే, నాసిరకపువని 2012 నవంబర్‌లో, అంటే ఏకంగా 13 నెలల తర్వాత తేల్చారు. ఆలోగా ఈ ఇంజెక్షన్లు తీసుకున్న వారి పరిస్థితి ఏమై ఉంటుందో!

పారాసెటమల్ ఐపి 500: రాష్ట్రంలో రోజుకు 20 లక్షల మంది రోగులు వాడే ఈ మాత్రలు కూడా డొల్లేనని తేలింది. ఇవి 2011 ఆగస్ట్‌లో తయారైన వెంటనే మార్కెట్లోకి వెళ్తే, 2012 నవంబర్‌లో నాణ్యత పరీక్షల్లో విషయం బయటపడింది. ఈలోగా ఎన్ని లక్షల మంది మాత్రలు మింగి ఉంటారో ఊహించుకోవచ్చు. ఇలా ఆస్పత్రులకు విడుదలయ్యాక చాలాకాలానికి వాటి నాణ్యతలోని డొల్లతనం బయటపడ్డ మందులు పదుల కొద్దీ ఉన్నాయి.

ఇలా జరగాలి
మందులు కొనుగోలు చేయక మునుపే ముందుగా వాటి బ్యాచ్‌ల నమూనాలు తెప్పించి ల్యాబ్‌లకు పంపి పరీక్షలు చేయించాలి. నాణ్యమైనవని తేలితేనే ఆస్పత్రులకు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. మందులు వచ్చిన మరుక్షణమే ఆస్పత్రుల బాట పడతాయి. కొన్ని శాంపిళ్లను అదే సమయంలో పరీక్షలకు పంపిస్తారు. ఆర్నెల్లకు గానీ వాటికి పరీక్షలు జరగవు. ఆలోపే ఆ మందులన్నీ రోగుల శరీరంలోకి వెళ్లిపోతాయి. అవి నాణ్యత లేనివని ఆ తర్వాత తేలినా ప్రయోజనం లేకుండాపోతోంది.

ల్యాబ్‌లనూ ‘మేనేజ్’ చేస్తున్నారు
రాష్ట్రంలో మనకు సరఫరా అయ్యే 400పైగా రకాల మందులకు సుమారు లక్ష బ్యాచ్‌లు వస్తాయి. వీటన్నింటికీ ఐటీఎల్, పీఆర్‌కే లేబొరేటరీలే పరీక్షలు చేస్తాయి. ఇవి రెండూ ప్రైవేటువే. ఔషధ నియంత్రణ శాఖ పరిధిలో ప్రభుత్వ లేబొరేటరీ ఉన్నా అనుమానం వచ్చిన మందులను మాత్రమే అక్కడ పరీక్ష చేస్తారు. లక్ష బ్యాచ్‌లకు పరీక్షలు చేయడం రెండు ల్యాబ్‌లకు సాధ్యం కాదు. దాంతో వంద బ్యాచ్‌లకు ఒక బ్యాచ్‌నే పంపిస్తున్నారు. వాటిలోనూ నాసిరకం అని తేలిన వాటిని సరఫరాదారులు ‘మేనేజ్’ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఏపీఎంఎస్‌ఐడీసీలోని నాణ్యత నియంత్రణ అధికారులూ ఈ బాగోతానికి అండగా నిలుస్తున్నారు. ఔషధ నియంత్రణ ల్యాబ్‌ను కూడా మేనేజ్ చేసుకుంటున్న ఉదంతాలు కోకొల్లలు.

రూ. 25 కోట్ల మందులు మురిగిపోయాయ్
నకిలీ మందులతో రోగులకు నరకం చవిచూపడం మాత్రమే కాదు... ఎడాపెడా మందులను కొనేసి, వాటిని వాడకుండా చివరికి మురగబెట్టడం కూడా మన వైద్య శాఖకే చెల్లింది. 2011-12లో బడ్జెట్ మిగిలిపోతోందని ఏకంగా రూ.160 కోట్ల విలువైన ఔషధాలను హడావుడిగా కొనుగోలు చేశారు. చివరికి కనీసం రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల విలువైన మందులను రోగులకు సరఫరా చేయకుండా పక్కన పెట్టారు. వాటి ఎక్స్‌పైరీ తేదీ జూలై, ఆగస్టు నెలల్లో ముగుస్తోంది. దాంతో చివరి క్షణాల్లో మేల్కొన్న అధికారులు, వాటిని వెనక్కు తీసుకునేలా మందుల కంపెనీలను నయానో భయానో ఒప్పించేం దుకు తంటాలు పడుతున్నారు. కంపెనీలతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీపీ) ఎండీ శుక్రవారం సమావేశమై కాలం చెల్లనున్న మందులను వెనక్కు తీసుకుని కొత్త మందులివ్వాల్సిందిగా కోరారు. కానీ అందుకు వారు ససేమిరా అన్నట్టు సమాచారం.

తమిళనాడులో ఇలా
తమిళనాడులో మన విధానానికి పూర్తి విరుద్ధం. పరీక్షలు జరపకుండా ఒక్క మాత్రను కూడా ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయరు. టీఎన్‌ఎంసీ (తమిళనాడు మెడికల్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా నాణ్యతా పరీక్షలు జరుపుతారు. మందులు ఆర్డర్ ఇవ్వగానే ఆ బ్యాచ్‌కు సంబంధించిన శాంపిళ్లు పంపాలి. వారం లోగా వాటిని పరీక్షించి ఫలితం వెల్లడిస్తారు. తర్వాత 90 రోజుల్లోగా టీఎన్‌ఎంసీకి మందులను సరఫరా చేయాలి. ఆలస్యమయ్యే ప్రతి రోజుకూ మందుల ధరలో 0.5 శాతం జరిమానా విధిస్తారు. ఏ కంపెనీ మందులైనా నాణ్యత లేదని రెండోసారి తేలితే కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడతారు.

ల్యాబ్‌లు లేకనే
రాష్ట్రంలో ల్యాబ్‌లు లేకనే ఇబ్బంది కలుగుతోంది. రెండే ల్యాబులున్నాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసిన 35 ల్యాబ్‌లతో జూన్ 9న సమావేశం ఏర్పాటు చేశాం. అదే రేటుకు ఇక్కడ కూడా శాంపిళ్లు పరీక్షించాలని చెబుతున్నాం. ఆ తర్వాత నుంచి నాణ్యత రుజువయ్యాకే ఆస్పత్రులకు పంపుతాం.
- డాక్టర్ మధుసూదన్‌రావు,
క్వాలిటీ కంట్రోల్ అధికారి, ఏపీఎంఎస్‌ఐడీసీ

కిడ్నీ, లివర్‌లపై దుష్ఫలితాలు
ఏ ఔషధాలైనా తొలుత మూత్రపిండాలు, కాలేయంపైనే ప్రభావం చూపుతాయి. దుష్ఫలితాలకు బలయ్యేది కూడా అవే. నాసిరకం లేదా, మోతాదు సరిగా లేని యాంటీబయోటిక్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మూత్రపిండాలు, కాలేయాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి రోగికి అప్పటికప్పుడు ఏమీ కాకపోయినా భవిష్యత్‌లో ఇబ్బంది ఉంటుంది. గుండెపోటు, ప్రసవాలు, రక్తపోటు, నరాల సంబంధిత వ్యాధులకు వాడే ఏ మందులనైనా పరీక్షలు చేసి నాణ్యమైనవని నిర్ధారణ జరిగాకే రోగికివ్వాలి.
- డాక్టర్ జె.రంగనాథ్,
మూత్రపిండాల వ్యాధి నిపుణుడు, ప్రైమ్ హాస్పిటల్

మరిన్ని వార్తలు