ఇక పోరుబాట!

2 Aug, 2015 02:09 IST|Sakshi

పట్టిసీమ పేరుతో కొత్త ప్రాజెక్టు చేపట్టి రూ.1600కోట్లు ఖర్చు చేస్తున్నారు... గోదావరి పుష్కరాలకు రూ.1600కోట్లు ఖర్చు చేశారు. ‘అనంత’లో నాలుగేళ్లుగా వర్షాలు లేక... సాగునీళ్లు ‘కరువై’ పంటపండించలేక లక్షలమంది వలసలు పోతున్నా... ఏడాదిలో 87మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇక్కడి రైతులపై చంద్రబాబుకు కనికరం కూడా కలగలేదు. పంటలకు నీళ్లిచ్చి రైతులను ఆదుకుందామనే ఆలోచన రాలేదు. చిత్తూరు జిల్లా కుప్పంకు నీళ్ల తరలించడమే లక్ష్యంగా హంద్రీ- నీవా పనులు చేయిస్తున్నారు. కళ్లెదుట నీళ్లు ఉన్నా పారించుకోలేని స్థితి ‘అనంత’కు కల్పించారు. ఈ క్రమంలో ‘అఖిలపక్షం’ ఆధ్వర్యంలో సోమవారం రైతు సదస్సును నిర్వహించనున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం:
 ‘అనంత’రైతు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బతికేందుకు ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. జిల్లాలో 4లక్షల మంది రైతులు వలసెళ్లారంటే కరువు ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ ఏడాది వర్షాలు కురవకపోతే ‘అనంత’రైతాంగం, ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నీ కేవలం సాగునీటి వనరులు లేక వస్తున్నవే! 2003 ముందు కూడా ‘అనంత’ పరిస్థితులు దుర్భరంగానే ఉండేవి. తినేందుకు తిండి లేక గంజికేంద్రాలు ఏర్పాటు చేసిన రోజులు కూడా ఇప్పటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 2014లోపు 85శాతం పనులు పూర్తయ్యాయి. 2012లోనే హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు వచ్చాయి. జీడిపల్లి రిజర్వాయర్‌లో తొణికిసలాడుతున్న కృష్ణమ్మను చూసి ‘అనంత’ రైతులు సంబరపడిపోయారు. ‘అనంత’ రాత మారుతుందని ఆశపడ్డారు.
 
 ఆశలు అడియాశలు చేస్తున్న బాబు సర్కారు
 హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.45లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఫేజ్-1 ద్వారా 1.18లక్షలు, ఫేజ్-2 ద్వారా 2.27లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఫేజ్-1లో జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువకు పనులు పూర్తయ్యాయి. గతేడాది 16.9 టీఎంసీల నీళ్లు కూడా వచ్చాయి. వీటితో కనీసం 1.50లక్షల ఎకరాలకు నీరందించవచ్చు. అంటే మొదటి విడతలోని 1.18లక్షల ఎకరాలకు కాకుండా చెరువులనూ కృష్ణానీటితో నింపొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ (ఉప, పిల్లకాలువల నిర్మాణం) వ్యవస్థకు ఫుల్‌స్టాప్ పెట్టింది. నెలకోసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ పనులు ఆలస్యం చేయండని అధికారికంగా జీవో(నెంబర్ 22) జారీ చేశారు.
 
  వందకోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మొదటి విడతలో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తవుతాయి. ఇది పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు నీరందుతుంది. చెరువులకూ నీరు నింపేందుకు ‘మార్గం’ దొరుకుతుంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. పంటలు పండి రైతులు సంతోషంగా జీవిస్తారు. వలసలు, ఆత్మహత్యలకు చెక్‌పెట్టొచ్చు. అయితే చంద్రబాబు మాత్రం కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేదాకా ‘అనంత’కు నీళ్లివ్వకూడదని కంకణం కట్టుకున్నారు. కుప్పం వెనుకబడిన ప్రాంతమే! ఈ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలి. దీన్ని ‘అనంత’ వాసులు వ్యతిరేకించడం లేదు. అయితే వస్తున్న జలాలను ‘అనంత’కు ఇచ్చి తీసుకెళ్లాలని అడుగుతున్నారు. బాబు పట్టించుకోకపోవడం దారుణం.
 
 ప్రభుత్వంపై పోరుబాట
 ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయపార్టీలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. ప్రభుత్వంపై పోరు చేసి హక్కుగా దక్కాల్సిన జలాలను దక్కించుకునేందుకు సోమవారం ఉరవకొండలో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతుసదస్సు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి హాజరుకానున్నారు. రైతుసదస్సు నిర్వహిస్తున్నారని సమాచారంతో ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చింది. జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలో 25వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లిస్తామని రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఎన్నిమాటలు చెప్పినా ‘అనంత’వాసులను మోసం చేయడమే అని, నీళ్లిచ్చేదాకా ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తామని అఖిలపక్షం నేతలు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు