మహిళలను కాపాడుకోవడానికి హింస తప్పదు

15 Apr, 2018 03:10 IST|Sakshi

కఠువా అత్యాచార ఘటన కలచివేసింది: పవన్‌కల్యాణ్‌

సాక్షి, అమరావతి: మహిళల్ని కాపాడుకొనేందుకు హింస తప్పదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆడపిల్లల జోలికెళ్తే బహిరంగంగా తోలు తీయాలన్నారు. అహింసా పరమోధర్మః అనే మాట ఈ సందర్భంలో కుదరదన్నారు. జమ్మూకశ్మీర్‌ కఠువాలో ముక్కు పచ్చలారని బాలికపై మానవ మృగాలు అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తన హృదయాన్ని ద్రవింపచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం జనసేన కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ‘వీర మహిళా’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమ వివరాలను మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టేవాళ్లని బహిరంగంగా శిక్షించాలి. సింగపూర్‌ తరహాలో బెత్తం పట్టుకొనే శిక్షలు రావాలి. ఆడ పిల్లల జోలికి వెళ్లేవాళ్లను బహిరంగంగా శిక్షిస్తే అందరిలో భయం పుడుతుంది.

సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగాయి. కథువాలో చిన్నారిపై అత్యాచారం, హత్యకి సినిమాలు, కళలు ప్రేరేపించాయా? పశువుకైనా ప్రకృతి నియమం ఉంటుందేమో.. అలాంటి మానవ మృగాలకి ఏమీ ఉండటం లేదు’ అని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆడపిల్లల్ని రక్షించుకొనేందుకు మనదేశంలోనూ కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు