ప్రమాదం కాదు ముమ్మాటికీ హత్యే!

10 Dec, 2017 11:37 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ ఎదుట కన్నీరు మున్నీరైన పడవ ప్రమాద బాధిత కుటుంబాలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోయిన ప్రాణాలను ఎలాగూ తీసుకురాలేం.. కనీసం భవిష్యత్తులో అయినా పడవ ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రకాశం భవనం ఎదుట ఉన్న ఆర్‌డీఓ కార్యాలయ ఆవరణలోని ఎన్‌టీఆర్‌ కళాక్షేత్రంలో నవంబరు 12న విజయవాడ వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ముందుగా బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని, ప్రభుత్వ సాయాన్ని ఆరా తీశారు.

అనంతరం బాధిత కుటుంబసభ్యులు కొందరిని వేదికపైకి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. తాను ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై మాటలతో దాడి చేసేందుకు రాలేదని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరు సున్నితత్వం మరిచిపోతున్నంత కాలం ఇటువంటి కన్నీళ్లే మిగులుతాయని పేర్కొన్నారు. ఈ కన్నీళ్ల నుంచే కోపం వస్తుంది. ఇదే ఉద్యమానికి, చివరికి యుద్ధానికి కూడా దారితీస్తుందనే విషయం మరువకూడదన్నారు. టూరిజం శాఖ లైఫ్‌ కెట్లుకోసం రూ.5 లక్షలు వెచ్చించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు.

ప్రమాదం కాదు ముమ్మాటికీ హత్యే!
– పవన్‌ కల్యాణ్‌ ఎదుట కన్నీరు మున్నీరైన మనస్విని
ఒంగోలు: పడవ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు ఒంగోలుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఎన్‌టీఆర్‌ కళాక్షేత్రంలో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలని వారిని కోరారు. దీంతో ప్రమాదంలో మృతిచెందిన  లీలావతి కుమార్తె దేవభక్తుని మనస్విని వేదికపైకి వచ్చి కన్నీరు మున్నీరైంది. 

ముమ్మాటికి హత్యే..
మా అమ్మ చిన్నప్పటినుంచి కష్టాల్లోనే పుట్టి పెరిగింది. వివాహం అయిన మూడు సంవత్సరాలకే మా నాన్న మరణించాడు. నాకు నాలుగు నెలల వయస్సునుంచి సర్వస్వం తానై నన్ను పెంచింది. విద్య కావొచ్చు, మరే విషయమైనా నాకు అన్నీ ఆమే. నాకు ఇంతచేసిన అమ్మను నేను ఉద్యోగంలో చేరిన తరువాత కూర్చోబెట్టి సుఖపెట్టాలనుకున్నా. కానీ ఒక్కమాటతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇప్పుడు నేను ఏం చేస్తే మా అమ్మ కళ్లల్లో ఆనందాన్ని చూడగలను. ఇది యాక్సిడెంటల్‌ అంటున్నారు. లైఫ్‌ జాకెట్లు అడిగినా ఇవ్వకపోవడం అంటే ఇది ముమ్మాటికి హత్యే. ఇప్పుడు నాకు అమ్మవస్తుందా..నేను అనాధగా మారిపోయాను. కనీసం బోటుకు అనుమతి లేదు, బోటు డ్రైవర్‌కు లైసెన్స్‌లేదు. బోటు తిరగబడినపుడు నీళ్లుల్లో కన్నుమూసిన వారు ఎంతగా విలవిలలాడి ఉంటారో ఊహించుకోవడానికే భయమేస్తుంది. అటువంటిది మరణించిన వారు ఎంతగా విలవిలలాడి ఉంటారో ఊహించాల్సిందే. మా అమ్మకు నీళ్లంటేనే భయం. ఆమె ఎంతగా విలవిలలాడి ఉంటుందో..!
  –  దేవభక్తుని మనస్విని, లీలావతి కుమార్తె

ప్రభుత్వ వైఫల్యం వల్లే..
అనుమతి లేని బోటును నడిపేందుకు అవకాశం కల్పించడానికి కారణం ఓ మంత్రి చేసిన సిఫారసే కారణంగా తెలుస్తోంది. కేవలం రూ.60 టిక్కెట్టుకు రూ.300 వసూలు చేయడం, లైఫ్‌ జాకెట్లు అవసరం లేదని చెప్పడం, పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. ఇద్దరూ చనిపోతామని తెలిసి మనవరాలిని ఎత్తిపట్టుకొని బతికించారు. అందుకే చిన్నారి ఉజ్వలసాయి జీవించి ఉంది. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా కూలంకషంగా చర్చించాలి
–  పూర్ణచంద్రరావు, ప్రమాదంలో మృతిచెందిన సీతారామయ్య మేనల్లుడు 

మరిన్ని వార్తలు