గెలిచినా రాజీనామానే..?

1 Apr, 2019 10:33 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏలూరులో మకాం ఉంటారని గతంలో ఇల్లు వెతికారు. తర్వాత ఓటు కూడా ఇక్కడే నమోదు చేశారు. ఏలూరులో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఏం అనుకున్నారో తెలియదు కాని విజయవాడలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఓటు కూడా అక్కడికి మార్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక హడావుడిగా గాజువాక, భీమవరంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన తాజా కబురు ఏమిటంటే పవన్‌ కల్యాణ్‌ గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు.  విశాఖపట్నం తో ఏం సంబంధం ఉందని ఇక్కడ పోటీ చేస్తున్నారని, నాన్‌లోకల్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు. ఎన్నికలకు పది రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గెలిస్తే ఇక్కడే ఉంటానని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చేందుకని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే భీమవరంలో గెలుపుపై నమ్మకం లేదని, అందువల్ల ఒకవేళ గెలిచినా భీమవరం స్థానాన్ని పవన్‌ వదులుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ ఉండే విషయంపై ప్రకటన చేస్తారేమో చూడాలి.  గెలిచినా ఇక్కడ ఉంటారన్న నమ్మకం అయితే భీమవరం ప్రజలకు లేకుండా పోయింది.  

ఏలూరు, తాడేపల్లిగూడెం, అనంతపురం, పిఠాపురం, విజయవాడ సెంట్రల్‌ ఇలా అనేక నియోజకవర్గాలను తెరపైకి తెచ్చి ఆ తర్వాత సర్వేలు చేయించుకుని కాపు ఓట్లు ఎక్కువ ఉన్న భీమవరం, గాజువాక సీట్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కనీసం భీమవరంలో పోటీ చేయాలని భావించినప్పుడైనా ముందుగా పవన్‌ కల్యాణ్‌ ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం జనసేన వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ తనతో పాటు తన అన్నను కూడా నర్సాపురం సీటులో పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక్కరే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇల్లు తీసుకునే ప్రయత్నం ఆయన నుంచి కూడా జరగలేదు. ఎన్నికల ఫలితాల తర్వాతే వారు ఇక్కడ ఉండాలా వద్దా అన్నది ఆలోచించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత కూడా కనీసం నామినేషన్‌ సందర్భంలోనైనా ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదని. ఇప్పుడు సరిగ్గా పదిరోజులు కూడా ప్రచార గడువు లేని పరిస్థితుల్లో  కూడా ఇల్లు తీసుకోకపోవడం, కనీసం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఒక ఖాళీ స్థలం తీసుకుని అక్కడ ఎన్నికల కార్యాలయం పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు వచ్చినా పెదఅమిరంలోని నిర్మలాదేవి కళ్యాణ మండపంలో బస చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడే బస చేస్తున్నారు. జిల్లా నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు కనీసం పార్టీ కార్యాలయం కూడా లేకపోవడం ఏంటని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. భీమవరంలో గత రెండుసార్లుగా పెడన నియోజకవర్గం నుంచి ఇక్కడకి వచ్చి స్థిరపడిన అంజిబాబును గెలిపించడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉండిపోయామన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను భీమవరం ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం జనసేనలో కనపడటం లేదు.

గతంలో ఎన్టీఆర్‌ రెండుచోట్ల పోటీచేసినా ఒకటి ఆంధ్రాలో రెండోది తెలంగాణాలోగాని రాయలసీమలోగాని ఉండేటట్లు చూసుకున్నారు. చిరంజీవి కూడా కోస్తా, రాయలసీమల్లో పోటీ చేశారు. కానీ పవన్‌ మాత్రం పూర్తిగా కోస్తాలోనే రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో కులం బలం వున్నా, నమ్మలేం అని అనుకున్నారేమో? పైగా అన్న చిరంజీవికి జరిగిన పరాభవం గుర్తుకు వచ్చిందేమో?  గాజువాకపైనే నమ్మకం పెట్టుకుని అక్కడ ఇల్లు తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా రెండుచోట్ల గెలిచినా ఓ చోట రాజీనామా చేయాల్సిందే. మళ్లీ ఉపఎన్నిక రావాల్సిందే. అందువల్ల పవన్‌ భీమవరం నుంచి గెలిచినా రాజీనామాకే డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని భీమవరం జనాలు అర్థం చేసుకుంటారని వైఎస్సార్‌ సీపీ గట్టి నమ్మకంతో ఉంది. ఇక్కడ లోకల్‌ అయిన గ్రంధికి ప్రజలు పట్టం కట్టడం ఖాయం అని స్థానికులు అంటున్నారు.  

మరిన్ని వార్తలు