ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు : పవన్‌

16 May, 2018 17:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటనతో తన గుండె బరువెక్కిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రోజు వారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ దుర్ఘటనకి సంబధించిన వివరాలు తెలియగానే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని జనసేన కార్యకర్తలకు సూచించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదానికి గురైన లాంచీకి సరైన అనుమతులు లేవని, లోపం ఎవరిదని ప్రశ్నించారు.

జవాబుదారీతనం లేని పాలన కారణంగానే అమాయకులు జలసమాధి అయ్యారని పవన్‌ మండిపడ్డారు. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి చిన్న అవసరానికి గిరిజనులు నదిలోనే ప్రయాణిస్తూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి, అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజనులకు ఇప్పటికైనా మౌళిక సదుపాయలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

మరిన్ని వార్తలు