నోరు విప్పనున్న పవన్ కల్యాణ్

7 Mar, 2014 00:46 IST|Sakshi
నోరు విప్పనున్న పవన్ కల్యాణ్

* రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం
 
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ తన రాజకీయ పునఃప్రవేశం, రాజకీయాలపై రాసిన పుస్తకావిష్కరణ తదితర అంశాలపై నోరు విప్పనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మనస్సులోని మాట చెబుతారని సన్నిహితవర్గాల సమాచారం. మీడియాతో సుమారు 45 నిమిషాలు మాట్లాడేందుకు అనువుగా ఆయన నోట్‌ను సిద్ధం చేసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఇంకా జాప్యం చేయకుండా రాజకీయ ప్రవేశం లేదా ఎవరికైనా మద్దతు ఇవ్వటం తదితర అంశాలపై స్పష్టత ఇస్తే మంచిదని సన్నిహితులు పవన్‌కు సూచించటంతోపాటు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

* సామాన్యుడికి న్యాయం జరగాలంటే పరిపాలన ఎలా ఉండాలి? ఇప్పటివరకూ రాజకీయాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్‌లో అవి ఎలా ఉండాలి? ఎలాంటి రాజకీయ నాయకులు అవసరం? తదితర  అంశాలపై పవన్ ఇప్పటికే ఒక పుస్తకాన్ని రాశారు.

రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేసే విలేకరుల భేటీలో తన మనోభిప్రాయాన్ని వెల్లడించాక పవన్ తన పుస్తకాన్ని మరో కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

సోదరుడు, సినీనటుడు నాగబాబు కూడా పవన్ కల్యాణ్ వెంట తెరమీదకు రానున్నారు. టీడీపీకి చెందిన పారిశ్రామిక వేత్తలు పవన్‌ను పార్టీలో చేర్పించుకునే విషయంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను వివరిస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు