పవన్ కల్యాణ్‌ క్లారిటీ ఇవ్వాలి

2 Feb, 2017 14:49 IST|Sakshi
పవన్ కల్యాణ్‌ క్లారిటీ ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగితే చంద్రబాబు, టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని వైఎస్ఆర్ సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ్ అమర్నాథ్‌  విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వనందుకు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారా అని నిలదీశారు.

గురువారం మీడియా సమావేశంలో అమర్నాథ్‌ మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసు తర్వాత రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా చంద్రబాబు న్యాయం జరిగినట్లు భావిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నష్టపోతుంటే చంద్రబాబు సంతోష పడుతున్నారని, ప్రత్యేక హోదా రాకపోవడానికి కర్త, కర్మ, క్రియ ఆయనేనని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు వెనకుండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల శరీరాలు వేరైనా అవిభక్త ఆత్మలని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని అమర్నాథ్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వరుసగా ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించరని అమర్నాథ్‌ పేర్కొన్నారు. హోదాపై వెంకయ్య నాయుడిని మాత్రమే పవన్ ప్రశ్నిస్తున్నారు కానీ చంద్రబాబును అడగటం లేదని అన్నారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు వ్యతిరేకంగా కాదని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్ కల్యాణ్‌ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పారు.