బ్యాంకు దోపిడీలకు కళ్లెం వేయొచ్చు

21 Nov, 2014 02:12 IST|Sakshi
బ్యాంకు దోపిడీలకు కళ్లెం వేయొచ్చు

పవన్ సెక్యూరిటీ సిస్టమ్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ
 
పలమనేరు: జిల్లాలో కొన్నాళ్లుగా జరుగుతున్న బ్యాంకు దోపిడీలను పరిశీలిస్తే దొంగలు నూతన టెక్నాలజీ వాడుతున్నట్లు అర్థమవుతోంది. అదే రీతిలో బ్యాంకుల వద్ద అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడకపోవడం బ్యాంకర్ల తప్పిదమే అని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలంటే బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ బ్యాంకుకు ఇన్సూరెన్స్ ఉందంటూ భద్రత గురించి బెంగపడడం లేదు. కనీసం రాత్రిపూట వాచ్‌మెన్ సైతం లేని బ్యాంకులు జిల్లాలో 90 శాతం దాకా ఉన్నాయంటే భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకోవచ్చు.

జులాయి సినిమాలో లాగే..
మూడ్రోజుల క్రితం వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జరిగిన దోపిడీ జులాయి సినిమాలో సన్నివేశాన్ని తలపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరా వైర్లను కట్ చేయడం, గ్యాస్ కటర్లను ఉపయోగించి లాకర్లు తెరవడం, ఆపై ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లడం, ముఖాలకు మాస్క్‌లు ధరించడం చేశారు. ఇలా దొంగలు అన్ని విధాలా సాంకేతికంగా ముందుకెళుతున్నారు. ఇదే రీతిలో ప్రజలు లేదా బ్యాంకులు మరింత అడ్వాన్స్ టెక్నాల జీని ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది.
 
పవన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నట్లయితే..
పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ అనే గ్రామీణ శాస్త్రవేత్త దొంగలను పట్టేందుకు తయారు చేసిన సెక్యూరిటి సిస్టమ్ ఎంతో అడ్సాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో దొంగ లోపలికి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా అలారం రావడం, అనంతరం ఫ్లాష్ వచ్చి కెమెరా ఫొటోలు తీయడం, యజమాని సెల్‌ఫోన్‌తో పాటు మరో ఐదుగురికి కాల్ వెల్లడం, 100 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వెళ్లడం తదితర సౌకర్యాలున్నాయి.

ఒకవేళ దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేసినా సెన్సార్లు పనిచేస్తాయి కాబట్టి ఫొటో, బెల్, కాల్ అలెర్ట్ తదితరాలతో ఆ దొంగల వివరాలు తెలుస్తాయి. అందుకే పోలీసులు సైతం సంబంధిత బ్యాం కర్లను పిలిపించి బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇకనైనా బ్యాంకుల వద్ద మరింత గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉంది.

మరిన్ని వార్తలు