పీసీబీ సర్క్యులర్ల అమలు నిలిపివేత

6 Mar, 2014 01:27 IST|Sakshi

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) నిధికి వారి ప్రాజెక్టు వ్యయంలో ఒక శాతం మొత్తాన్ని కేటాయించాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) జారీ చేసిన సర్క్యులర్లను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మహిళా సాధికారిత కోసం ఏర్పాటు చేసిన సీఎస్‌ఆర్ నిధికి ప్రాజెక్టు వ్యయంలో కనీసం ఒక శాతం మొత్తాన్ని, తర్వాత పదేళ్లపాటు 0.2 శాతం మొత్తాన్ని రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు కేటాయించాలంటూ 2012లో పీసీబీ సర్క్యులర్లు జారీచేసింది. ఈ సర్కులర్ల అమలు బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.
 
 ఇందులో భాగంగా ఇటీవల కొన్ని జిల్లాల కలెక్టర్లు పలు పరిశ్రమలకు నోటీసులు జారీ సీఎస్‌ఆర్ నిధికి డబ్బు జమ చేయాలని ఆదేశించారు. ఇలా నోటీసులు అందుకున్న మెదక్ జిల్లాలోని థర్మల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయిం చింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫున చల్లా గుణరంజన్ వాదనలు వినిపిస్తూ.. ఇటువంటి నోటీసులు జారీ చేసే పరిధి పీసీబీకి లేదన్నారు. పీసీబీ జారీ చేసిన సర్క్యులర్ల వల్ల పరిశ్రమలపై భారం పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పీసీబీ సర్క్యులర్ల అమలు ను నిలిపివేస్తూ పై ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు