జిల్లా కాంగ్రెస్‌కు జంబో కార్యవర్గం

12 Oct, 2013 00:53 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యవర్గాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) ఖరారు చేసింది. 105మంది సభ్యుల జంబో కార్యవర్గాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు, జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి టి.నాగయ్య శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. సామాజిక సమీకరణలకు అనుగుణంగా కార్యవర్గం కూర్పు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన అధినాయకత్వం.. 21 మందిని ఉపాధ్యక్షులుగా నియమించింది. అదేవిధంగా 32మంది ప్రధాన కార్యదర్శులు, 23మంది కార్యదర్శులను ప్రకటించింది. సంయుక్త కార్యదర్శులుగా 15మందిని, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా 9మందిని, కార్యనిర్వాహక సభ్యులుగా ఐదుగురిని నియమించినట్లు తెలిపారు.

కొత్త వివాదం!
జిల్లా సారథ్యంపై ఇప్పటికే కాంగ్రెస్‌లో వివాదం నడుస్తోంది. క్యామ మల్లేశ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ ప్రకటించిన తీరును తప్పుపడుతున్న పార్టీ సీనియర్‌ నేత కేఎం ప్రతాప్‌... తానే అసలు సారథినని చెప్పుకుంటున్నారు. ఏఐసీసీ ఆమోదముద్ర వేయని మల్లేశ్‌ నియామకం చెల్లదని వాదిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఇన్‌చార్జి అధ్యక్షులనెప్పుడూ ప్రకటించలేదని, మల్లేశ్‌ నియామకంతో పీసీసీ కొత్త సంప్రదాయానికి తెరలేపడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మల్లేశ్‌ నియమించిన కమిటీని పీసీసీ ప్రకటించడం ప్రతాప్‌కు మింగుడు పడని అంశంగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గంపై ఆయనెలా స్పందిస్తారో వేచిచూడాలి..!
 

మరిన్ని వార్తలు