ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ

7 Jun, 2015 02:08 IST|Sakshi
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ

 * ‘రణభేరి’లో పీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం
* హామీలపై 8వ తేదీలోగా జవాబు చెప్పాలని డిమాండ్

రాజమండ్రి సిటీ: ఏడాది పాలనలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రప్రజలను మోసగించాయని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీల ఏడాది పాలనపై తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శనివారమిక్కడి సుబ్రహ్మణ్య మైదానంలో కాంగ్రెస్ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిని రఘువీరారెడ్డి నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 2018 నాటికి పోలవరం పూర్తి వంటి 600 వాగ్దానాలను ఎప్పటిలోగా అమలు చేస్తారో ఈనెల 8లోగా చెప్పాలని రఘువీరా కోరారు. లేనిపక్షంలో 9 నుంచి గడపగడపకూ వెళ్లి పాలకుల నిజస్వరూపాన్ని ఎండగడతామన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చట్టం చేయాల్సిన పనిలేదని, ఏచట్టం చేయకుండానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ సర్కారు ప్రకటించిందని ఆయన అన్నారు.

మోసం, దగాకోరు వాగ్దానాలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లిచ్చి.. గుజరాత్‌కు రూ.60 వేలకోట్లు మంజూరు చేయడమే మోదీ పాలనంటూ దుయ్యబట్టారు. రిలయన్స్ సంస్థకోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలంలతోపాటు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు.
 
8న టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏడాది నయవంచక పాలనకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీలను దహనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో వైఫల్యాలతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించడంలో విఫలమైన తీరును ఎక్కడికక్కడ ప్రజలకు వివరించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 8న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   పార్టీ యువజన, ఎన్‌ఎస్‌యూఐ, వివిధ అనుబంధ విభాగాల వారితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

మరిన్ని వార్తలు