డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి..

11 Oct, 2017 15:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని పీసీసీ డిమాండ్‌ చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం ఒక్క నోటిఫికేషన్‌ను మాత్రమే నామమాత్రంగా విడుదల చేసిందని ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ‘ ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తాం’ అని హామీ ఇచ్చింది. ఈ మూడున్నరేళ్ల ఏటా ఒక డీఎస్సీ చొప్పున మూడు డీఎస్సీలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం ఒక డీఎస్సీని మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంది. ఈ నోటిఫికేషన్‌ కూడా 2013లో ప్రభుత్వం 15 వేలు పోస్టులు ప్రకటించి కేవలం 10వేల పోస్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించింది.

దాదాపుగా రాష్ట్రంలో 6 లక్షల మంది బీఈడీ, టెట్ తదితర కోర్సులు పూర్తి చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. వేలాది రూపాయాలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకుని నోటిఫికేసన్‌ కోసం పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్నరనే కారణం చూసి వందలాది పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది.  ఇవికాకుండా మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలో కొన్ని సంవత్సరాల నంచి టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఏటా రిటైరయ్యే పోస్టులు వేలల్లో ఉన్నాయి. ఇవేకాక కస్తూరీభా, గురుకుల పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం పోస్టులు వేలాదిగా ఉన్నాయి. పాఠశాలలను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు తీరని అన్యాయం చేస్తోంది.

2015లో ఆంధ్రప్రదేశ్‌లో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌ సంబంధిత కేంద్రమంత్రి లిఖిత పూర్వకమైన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మేలు కలిగేలా వ్యవహరిస్తోంది. నిరుద్యోగులకు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులన్నిటినీ తక్షణమే నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు అనుబంధమైన విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని ఐక్యంగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యమిస్తామని పీసీసీ తరపున హెచ్చరిస్తున్నాం.’ అని పీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు