టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ

21 Mar, 2017 02:22 IST|Sakshi
టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ

తూర్పు రాయలసీమలో ‘విఠపు’, పశ్చిమ రాయలసీమలో ‘కత్తి’ ఘనవిజయం

సాక్షి, చిత్తూరు/సాక్షి, ప్రతినిధి, అనంతపురం/సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో విఠపు బాలసుబ్రహ్మణ్యం.. తన సమీప ప్రత్యర్థి, అధికార టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.  

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి.. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక ఓటమి పాలయ్యారు.   కత్తి నరసింహారెడ్డికి 3,763 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్‌ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.