మైమరపించి.. ఆపై మరణించి..

8 Sep, 2018 11:03 IST|Sakshi
నాట్యమాడుతున్న నెమలి

చిత్తూరు, భాకరాపేట : అడవుల్లో నుంచి ఓ నెమలి గ్రామంలోకి వచ్చి పురి విప్పి నాట్యమాడుతూ గ్రామస్తులను మైమరపిస్తూ ప్రాణాలు వదిలిన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు పంచాయతీ గాజులవారిపల్లెలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. చాలారోజులుగా ఓ నెమలి తరచూ గ్రామంలోకి వచ్చి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయేది. గ్రామస్తులు కూడా నెమలి రాక కోసం చూసేవారు. క్రమంగా అది ఆ గ్రామంలో ఓ భాగమైంది. అది శుక్రవారం ఉదయం ఓ చెట్టు కింద నాట్యమాడింది. గ్రామస్తులు తమ మొబైల్‌ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.

నెమలి హఠాత్తుగా గిలగిలమంటూ కొట్టుకుని కింద పడిపోయింది. గ్రామస్తులు పరిశీలించ గా అప్పటికే ప్రాణాలు వదిలేసింది. దీంతో గ్రామస్తులు ఆవేదన చెందారు. గ్రామంలో చంటి బిడ్డలు ఏడిస్తే నెమలిని చూపిం చి వారికి బువ్వ పెట్టేవారమని, ఉదయం, సాయంత్రం వేళల్లో పురివిప్పి నాట్యం ఆడుతుంటే చూడడానికి కన్నులు చాలవని గ్రామస్తులు చెప్పారు. వెంటనే భాకరాపేట ఫారెస్టు అధికారులకు సమాచారం తెలియజేయడంతో వారు వచ్చి తీసుకెళ్లి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి జూపార్క్‌కు పంపించారు. గాజులవారిలపల్లె గ్రామస్తులు మాత్రం నెమలి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు సైతం ఆ గ్రామస్తులు నెమలిపై చూపిన ప్రేమకు ఆశ్చర్యానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు