శనగ రైతులపై వేలం పిడుగు

10 Jan, 2014 02:07 IST|Sakshi

 కోవెలకుంట్ల, న్యూస్‌లైన్ :
 మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది శనగ రైతు దుస్థితి. అసలే పంటలు పండక.. గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతున్న తరుణంలో.. ఉన్న దిగుబడులను కూడా వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో శనగ పంట సాగవుతోంది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం బస్తా రూ.5500 ప్రకారం కొనుగోలు చేసింది. ఈ ధర కేవలం మూడు, నాలుగునెలలు మాత్రమే కొనసాగింది. అప్పట్లో ధరలు మరింత పెరుగుతాయని కొందరు రైతులు విక్రయించలేదు. చాలా మంది రైతుల దిగుబడులు పొలాల్లో కోత దశలోనే ఉన్నాయి. దీంతో పెరిగిన ధరలను ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక్కసారిగా ధరలు రూ.3 వేలకు పడిపోవడంతో నిల్వలను 2011-12 సంవత్సరాల్లో గోదాములకు చేర్చారు. వాటిపై రుణాలు తీసుకుని ఈ ఏడాది శనగ సాగు చేశారు.
 
  కౌలు ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.20 వేలు వెచ్చించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 5 బస్తాల దిగుబడి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గోదాముల్లోని 350 మంది రైతుల దిగుబడులను వేలం వేస్తున్నట్లు కోవెలకుంట్ల స్టేట్‌బ్యాంక్ అధికారులు ప్రకటన జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడులను అమ్మినా గోదాము బాడుగలు, తీసుకున్న రుణం, వడ్డీ కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే భార్యా పిల్లలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొంటున్నారు.
 
 రెండేళ్లుగా గోదాములోనే 110 బస్తాలు: భాస్కర్‌రెడ్డి, గుళ్లదూర్తి
 గుళ్లదూర్తిలో 15 ఎకరాల సొంతపొలంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. 110 బస్తాల తెల్ల శనగలను అల్లూరు గోదాములో నిల్వ ఉంచాను. వాటిపై బ్యాంకులో రూ.2.10 లక్షల రుణం తీసుకున్నా. రెండేళ్లుగా గిట్టుబాటు ధరలేక అమ్మలేకపోయాను.
 
 రూ. 4.40 లక్షల రుణం తీసుకున్నాను: మల్లికార్జునరెడ్డి, గుళ్లదూర్తి
 పదెక రాల సొంతపొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఏటా శనగ, వరి, జొన్న పంటలు సాగు చేస్తున్నాను. అల్లూరు గోదాములో 460 తెల్లశనగ బస్తాలను నిల్వ ఉంచి రూ. 4.40 లక్షలు రుణం తీసుకున్నాను. ఈ ఏడాది శనగ దిగుబడులు అంతంత మాత్ర ంగానే ఉన్నాయి. బ్యాంకు అధికారులు బస్తాలను వేలం వేస్తామంటున్నారు. ఇలాంటి సమయంలో వేలం వేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు