ఆడుకుంటూనే అనంతలోకాలకు..

3 Aug, 2014 03:22 IST|Sakshi
ఆడుకుంటూనే అనంతలోకాలకు..
  • పెడనలో పేలుడు
  •  ఐదేళ్ల బాలుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
  •  బాంబు పేలిందంటూ ప్రచారం
  •  మంత్రి, ఎస్పీ, ధికారుల పరిశీలన
  •  అన్ని కోణాల్లో దర్యాప్తు :  ఎస్పీ
  • మచిలీపట్నం/పెడన :  పెడనలో  రైల్వేస్టేషన్, చేపల మార్కెట్‌కు సమీపంలో  పేలుడు ఘటన కలకలం సృష్టించింది. పేలుడు జరిగిన ప్రదేశంలో ఆడుకుంటున్న ముక్కుపచ్చలారని చిన్నారుల్లో  మహ్మద్ రఫీ అక్కడికక్కడే మృతిచెందగా, మరో చిన్నారి మహ్మద్ ఇద్రీస్ తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు.    పెద్దశబ్దంతో పేలుడు సంభవించటంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.  పేలుడుకు  కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పెడన పట్టణంలోని 15వ వార్డులో గల ఉర్దూ మిక్స్‌డ్ పాఠశాలలో  శనివారం పేరెంట్స్ డే నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి రఫీ తండ్రి హనీఫ్, ఇద్రీస్ తండ్రి ఇలియాస్ హాజరయ్యారు. తమ కుమారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు 70 మీటర్ల దూరంలోని వేపచెట్టు కింద రఫీ, ఇద్రీస్ ఆడుకుంటుండగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రఫీ గాలిలోకి ఎగిరి చెట్టుకొమ్మకు బలంగా గుద్దుకుని మృతిచెందాడు.  రఫీ శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. కుడి చేయి ముంజేతి వరకు తెగిపడింది. కుడి వైపు కన్ను బయటకు వచ్చేసింది.  

    ఘటనా స్థలంలో మాంసపు ముద్దలు కనిపించాయి. రఫీకి కొద్ది దూరంలో ఉన్న ఇద్రీస్  తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. పెద్దపెట్టున పేలుడు శబ్దం వినపడటంతో స్థానికులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే రఫీ మృతి చెందగా, ఇద్రీస్ తీవ్రగాయాలపాలై ఇంటికి పరుగుపెట్టాడు. పేలుడు శబ్దం కిలోమీటరు దూరానికి పైగా వినిపించిందని, గ్యాస్‌సిలిండర్ పేలి ఉంటుందని భావించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో చిన్నపాటి గొయ్యి ఏర్పడింది.
     
    ఆడుకుంటానని వెళ్లాడు..
     
    హనీఫ్‌కు  సంతానం లేకపోవటంతో తన సోదరుడు కుమారుడు రఫీని పుట్టిన నెలన్నర రోజులకే పెంపు తెచ్చుకున్నాడు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. శనివారం  రఫీతోపాటు పాఠశాలకు వెళ్లి కుమారుడితో పాటు భోజనం కూడా చేశాడు. అనంతరం తన సైకిల్‌షాపు వద్దకు వచ్చి పని చేసుకుంటుండగా పేలుడు శబ్దం వినిపించింది. అప్పటికే ఇద్రీస్ తండ్రి ఇలియాస్ కూడా హనీఫ్ సైకిల్ షాపు వద్దే ఉన్నాడు. వీరిద్దరూ ఏం జరిగిందో తెలుసుకునేందుకు   సైకిల్‌పై సంఘటనా స్థలానికి వెళ్లారు. ఊహించని ఘటన చూసి తల్లడిల్లిపోయారు.  హనీఫ్ కుమారుడు రఫీ మృతి చెందగా, ఇలియాస్ కుమారుడు ఇద్రీస్ తీవ్ర గాయాలపాలై కనిపించాడు. పేరెంట్స్ డే సందర్భంగా పాఠశాలలో రఫీ శ్లోకాలు చెప్పడం చూసి అందరూ మెచ్చుకున్నారని ఇంతలోనే తన కుమారుడు విగతజీవిగా మారాడంటూ హనీఫ్ ఆస్పత్రిలో కన్నీరు మున్నీరవడం చూపరులను కలచివేసింది.  రఫీ తల్లికి అనారోగ్యం ఉండటంతో రఫీ చనిపోయాడనే విషయాన్ని ఇంకా చెప్పలేదు.
     
    ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి, ఎస్పీ
     
    పెడన రైల్వేస్టేషన్, మార్కెట్ సమీపంలో పెద్దఎత్తున పేలుడు సంభవించిందని సమాచారం అందడంతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్పీ జి.విజయకుమార్, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఆర్డీవో పి సాయిబాబు, బందరు డీఎస్పీ కె. శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఏం జరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ నేతృత్వంలో బాంబ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ బృందాల ద్వారా మరిన్ని ఆధారాలు  సేకరించారు. సంఘటనా స్థలం నుంచి బాంబ్‌స్క్వాడ్ బృందం పెన్సిల్ బ్యాటరీలు, వైర్‌ముక్కలు, పేలుడు పదార్ధానికి సంబందించిన ఆధారాలను సేకరించారు.  మృతి చెందిన రఫీ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్రీస్‌ను మంత్రి, ఎస్పీ, ఇతర అధికారులు పరామర్శించారు. ఇద్రీస్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను వివరాలు  తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంఘటనను వివరించి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని కోరారు.  అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
     
    పేలుడు ఘటనపై భిన్న కథనాలు..
     
    పేలుడు ఘటనకు కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చూసిన వారు మందుగుండు సామాగ్రి పేలితే ఇంత తీవ్రత ఉండదని అంటున్నారు.  మంత్రి, ఎస్పీ, బాంబు స్క్వాడ్, ఏజేసీ, ఆర్డీవో సందర్శించటంతో స్థానికుల్లో అనుమానాలు నెలకొన్నాయి. పేలింది మందుగుండు సామాగ్రి కాదని బాంబు పేలటం వల్ల ఇంత హడావుడి జరుగుతోందని  చెప్పుకుంటున్నారు. పేలుడు సంభవించిన వెంటనే ఎస్పీ అక్కడకు చేరుకోగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహాల్లో సోదాలు నిర్వహించటం చర్చనీయాంశమైంది. ఘటనలో మృతి చెందిన రఫీ, ఇద్రీస్ తమకు దొరికిన పేలుడు సామాగ్రిపై కాగితాలు వేసి నిప్పు అంటించారనే వాదన వినబడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్రీస్ పోలీసులకు ఈ సంగతి  వెల్లడించాడని తెలిసింది.  శుక్రవారం పెడన పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగిన నేపథ్యంలో ప్రత్యర్థులను బెదిరించేందుకు ఏదైనా పార్టీ వారు నాటుబాంబులను  తీసుకువచ్చారా? అని కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల  ఎన్నికల సమయంలో పేలుడు సంభవించిన ప్రాంతంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతున్నారు.
     
    పోలీసుల అదుపులో మహిళ
     
    కాగా  ఓ మహిళను స్థానిక పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెడన పట్టణం 15వ వార్డుకు చెందిన ఓ విశ్రాంత కానిస్టేబుల్ భార్య పాస్పరస్, పొటాష్ తీసుకుని  టపాసులు, మతాబులు తయారు చేస్తుంటారు. శుభకార్యాలకు టపాసులను అమ్ముతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె మందు గుండు సామాగ్రిని బయట పడవేసి ఉంటే..దానిని  పిల్లలు  తీసుకుని వచ్చి కాల్చి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు