ఖదీర్‌బాబు, సుజాతాదేవికి ‘పెద్దిభొట్ల’ పురస్కారం ప్రదానం 

14 Dec, 2017 02:36 IST|Sakshi
పెద్దిభొట్ల సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న మహ్మద్‌ ఖదీర్‌బాబు, డి. సుజాతాదేవి. చిత్రంలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య తదితరులు

యువ కథకులు పెద్దిభొట్లను ఆదర్శంగా తీసుకోవాలి: శ్రీరమణ 

విజయవాడ కల్చరల్‌: ప్రముఖ కథా రచయిత, కథా పరిశోధకుడు మహ్మద్‌ ఖదీర్‌బాబు, బాల సాహిత్య కథా రచయిత్రి డి.సుజాతాదేవి 2017 సంవత్సరానికి గాను పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారాలను అందుకున్నారు. పెద్దిభొట్ల స్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సభలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్‌ రచయిత, కాలమిస్ట్‌ శ్రీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల జీవితాలే పెద్దిభొట్ల కథా వస్తువులని, యువ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

పురస్కారాల నిర్వాహకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య మాట్లాడుతూ తెలుగు కథా ప్రపంచానికి సేవలు చేస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం (అభ్యుదయ రచయితల సంఘం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెద్దిభొట్ల రాసిన కథలన్నీ ఆణిముత్యాలేనని వివరించారు. ఆయన కథలు ఆంగ్లంలోకి, రష్యన్‌ భాషలోకి అనువదించబడ్డాయన్నారు. కథారచయితలను లయోలా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జీవీ పూర్ణచంద్‌ పరిచయం చేశారు. పురస్కారాలు అందుకున్న ఖదీర్‌బాబు, సుజాతాదేవి తమ స్పందన తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి, ఎవీకే ఫౌండేషన్‌ నిర్వాహకులు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు