బాబు వంద రోజుల పాలన శూన్యం

17 Sep, 2014 03:43 IST|Sakshi
బాబు వంద రోజుల పాలన శూన్యం

పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఆయన ప్రమాణస్వీకారం చేసిన రోజున పెట్టిన ఐదు సంతకాలలో ఒక్కటీ అమలు కాలేదని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం పుంగనూరులో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారారన్నారు.
 
సొంత జిల్లాలో ఆదరణ కోల్పోయిన బాబు రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేసి, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని ప్రకటి ంచి ప్రస్తుతం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లకోసంహామీలు గుప్పించి, పదవిలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోయాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు దాదాపుగా పూర్తికావచ్చాయని, 20 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
 
అలాంటి ప్రాజెక్టుల పనులను నిలిపేయడంతో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల భూమి బీడుగా మారుతోందన్నారు. రాయలసీమలో ఏనాడూ చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు రాలేదని, అందుకే వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. రాజధాని ఏర్పాట్లలో రెఫరెండం చేపట్టాలని కోరారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అమలు చేయలేని హామీలను బడ్జెట్‌లో చూపెడుతూ నిధులు మాత్రం నామమాత్రంగా కేటాయించలేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2004వ సంవత్సరానికి ముందు పరిస్థితులు మ ళ్లీ రాబోతున్నాయని తెలిపారు.
 
రుణమాఫీ చేస్తే అభివృద్ధి ఆగిపోయినట్లేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడం చూస్తుంటే వారి నుంచి ఎలాంటి సహకారమూ అందేలా లేదని అన్నారు. సీఎం చంద్రబాబు రోజుకొక ప్రకటన తో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం మంత్రులను, ఎమ్మెల్యేలను, నేతలను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షమీమ్‌షరీఫ్, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు