అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టండి

4 Jan, 2019 10:48 IST|Sakshi
ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అగ్రిగోల్డ్‌ బాధితులు, (ఇన్‌సెట్‌) మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

నిలువునా వంచించిన టీడీపీ సర్కారు  

ఆస్తులు దోచుకోవడానికి టీడీపీ నేతల ప్రయత్నాలు

అగ్రిగోల్డ్‌ ఆస్తులు, అప్పుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి

ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ ధర్నాలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి,  సునీల్‌కుమార్‌ డిమాండ్‌

చిత్తూరు కలెక్టరేట్‌: నాలుగన్నర సంవత్సరాలుగా బాధితులను ఆదుకోకుం డా అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకుంటున్న అవినీతి టీడీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం చిత్తూరులోని కలెక్టరేట్‌ ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ధర్నా చేపట్టారు. తొలుతనగర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దుర్గమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో  పెద్దిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు తమ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. శాసనసభలో దీనిపై తొలిసారి తమ పార్టీయే గళం విప్పిందన్నారు. బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆ సొమ్మును బాధితులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై టీడీపీ కన్నుపడిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, కుమారుడు లోకేశ్, మంత్రులు అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నిం చడం దారుణమన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19.70 లక్షల మంది అగ్రిగోల్డ్‌  బాధితులకు న్యాయం చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 1995 నుంచి అగ్రిగోల్డ్‌  చిన్న రైతులు, అన్ని వర్గాల నుంచి డిపాజిట్లు సేకరించిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణం ఏదైనా ఉందంటే అది అగ్రిగోల్డేనన్నారు. అలాంటి వారికి టీడీపీ ప్రభుత్వం మద్ధతు పలికి చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇదంతా సీఎం చంద్రబాబునాయుడు అసమర్థపాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది మృతి చెంది తే 140 మందికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. టీడీపీ మంత్రులు పత్తిపాటి, సుజనాచౌదరిలు అగ్రిగోల్డ్‌ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డీఆర్వో గంగాధరగౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాంధీ,  జెడ్పీ మాజీ చైర్మన్‌ కుమారరాజా, ఈసీ మెంబర్‌ పురుషోత్తంరెడ్డి,  అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ జిల్లా కన్వీనర్‌ శ్రీనివాస్, బంగారుపాళెం మాజీ ఎంపీపీ సుగుణాకర్‌రెడ్డి, వేల్కూరు బాబురెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్‌ నాయకుడు గోవిందన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు