వీధి దీపం వెలగలేదా?

10 Feb, 2020 03:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెంటనే ఫిర్యాదు చేయండి..72 గంటల్లో పరిష్కారం 

నేడు వెరిఫికేషన్‌ కమిటీతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ

సాక్షి, అమరావతి: ఎల్‌ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్‌ రెస్పాన్స్‌ మెకానిజం–ఆర్‌ఆర్‌ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్‌ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.

గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్‌లో నమోదు చేస్తే ఈఈఎస్‌ఎల్‌ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్‌క్యాప్‌ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్‌ఎల్‌ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్‌ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ మాట్లాడుతూ ఎల్‌ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్‌ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు.   

మరిన్ని వార్తలు