ఇసుక రెడీ!

24 Sep, 2019 03:45 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు సిద్ధం

వరదలు తగ్గగానే ఏపీఎండీసీ ద్వారా సరఫరా

పట్టాదారు భూముల నుంచి కూడా తవ్వకాలకు అనుమతి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 41,37,675 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈనెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి సోమవారం వరకు లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశామని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్‌లను, 51 స్టాక్‌ యార్డ్‌ లను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా కోసం టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు.

గోదావరి, కృష్ణా నదిలో వరదల కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా మరింత వేగంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్‌యార్డ్‌లు పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కాగా, పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎక్కువమంది రైతులు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో 263 ఎకరాలలో ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని చెప్పారు. ఇక నెల్లూరు జిల్లాలో 12 రీచ్‌ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను, రోజుకు పదివేల క్యూబిక్‌ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కొత్త రీచ్‌లను గుర్తించామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తీసుకువచ్చేందుకు కూడా అనుమతిచ్చినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా, గోదావరిల్లో వరదలు తగ్గుముఖం పట్టగానే ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు