సీఎం జగన్‌ది మాటతప్పని వంశం

3 Feb, 2020 12:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.126 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్‌ నిర్మాణానికి ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కోసం రూ.126 కోట్లు కేటాయించినందుకుగాను కృష్ణలంక ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ ‘కృతజ్ఞత’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు కృష్ణలంక ప్రజలు పెద్దఎత్తున​ పాల్గొని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని సీఎం జగన్‌ అన్ని విధాల ఆదుకుంటారని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ ఇస్తున్నామని, రాని వారు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు : బొత్స
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు సురక్షితంగా ఉండేందుకే రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి బారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. కృష్ణలంక ప్రజల ఇబ్బందిని గుర్తించిన సీఎం జగన్‌.. రిటైనింగ్‌ వాల్‌ కోసం వెంటనే రూ.126 కోట్లు కేటాయించారన్నారు. అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్‌కు ప్రజల అశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు వేశామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని కొనియాడారు.

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
దశాబ్ధాలుగా కృష్ణ లంక లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నిధులు కేటాయించినందుకు సీఎం జగన్‌కు వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణ లంక లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ. 126 కోట్లు కేటాయించారు. ఆయనకు కృష్ణలంక ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు’ అని దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని అన్నారు. 

>
మరిన్ని వార్తలు