‘అక్టోబర్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం’

28 Sep, 2019 12:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎంపికైన సచివాలయ కార్యదర్శులకు ఈ నెల 30న నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘గ్రామ సచివాలయ వ్యవస్థ’ను తీసుకువచ్చామని తెలిపారు.

కేవలం ముడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలను సీఎం జగన్‌ భర్తీ చేయడం చూసి తట్టుకోలేక.. పేపర్‌ లీకేజీ అంటూ ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తాను ఆంధ్రజ్యోతి పేపర్‌ చదవడమే మానేశానని చెప్పారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అక్టోబర్‌ పది నుంచి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్య‍క్రమాలు విజయవంతం అయ్యేలా ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి  ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు