గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు

7 Mar, 2017 04:16 IST|Sakshi

సాలూరు: తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం నుంచి స్థానిక విలేకరులతో ఫోన్‌లో సోమవారం మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం ఆద్యంతం రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నట్టు పేర్కొన్నారన్నారు. జీడీపీ వృద్ధి రేటు కూడా పెరిగిపోతోందని చెప్పించారన్నారు.

వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాల్లో అభివృద్ధిపైనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందన్న విషయం అందరికీ తెలిసినదేనన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. దీనికి తోడు రాష్ట్రం ఆర్థిక లోటుతో నడుస్తోందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ఎలా దూసుకుపోతోందో..?, ఎటు దూసుకుపోతోందో ? తెలియడం లేదన్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్టేనని గవర్నర్‌తో చెప్పించడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని, విద్యుత్‌ బిల్లులు పెంచమని చెప్పి, నేడు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆర్థిక లోటును పూడ్చేసాకుతో విద్యుత్‌ బిల్లులతో  వినియోగదారుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అబద్ధాలతో గొప్పలు చెప్పించుకునేందుకే గవర్నర్‌ ప్రసంగాన్ని వాడుకున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు