రాజ్యాంగం ఉపయోగం మోసగాళ్లకేనా?

28 Jan, 2016 00:17 IST|Sakshi

ఒకే వ్యక్తికి నాలుగు కుల ధ్రువీకరణ పత్రాలా?
 సాలూరు ఎమ్మెల్యే పీడిక     రాజన్నదొర
 విజయనగరం మున్సిపాలిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మోసగాళ్లకు, దోపిడీ దొంగలకు ఉపయోగపడుతో ందని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన  స్థానిక విలేకరులతో మాట్లాడారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.భంజదేవ్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై జాయింట్ కలెక్టర్ బుధవారం విచారణచేపట్టగా వాయిదా కావాలని భంజ్‌దేవ్ కోరినట్లు తెలిపారు. 2006వ సంవత్సరంలో ఆర్‌పి.భంజ్‌దేవ్ కుల ధ్రువీకరణపై హైకోర్టు  ఆయన గిరిజనుడు కాదని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.
 
  అయితే అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును  బేఖాతరు చేస్తూ గతంలో ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించిన సబ్‌కలెక్టర్  శ్వేతామహంతి గిరిజనుడంటూ ఎలా కులధ్రువీకరణ  పత్రం జారీ  చేశారన్నారు. న్యాయస్థానం తీర్పును తలకిందులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. ప్రస్థుతం సదరు అధికారి వేరొక రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నా  విడిచిపెట్టేది లేదన్నారు.  ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.  ప్రధానంగా విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో  ఎక్కువగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు, పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నట్లు తెలిపారు.
 
   జిల్లాలో కులధ్రువీకరణ కేసులు  అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై యంత్రాంగం దృష్టి సారించి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ముఖ్యమంత్రికి తెలిసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియతో పాటు  స్వచ్ఛభారత్ ట్రాక్టర్  కొనుగోలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గిరిజన న్యాయవాది రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన నాయకులు శోభా.హైమావతి, శత్రుచర్ల, విజయరామరాజు, జనార్దన్ థాట్రాజ్‌లు ఎస్టీలు కాదని సెక్షన్ 11 ప్రకారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశామని, అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వేసిన కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో గుంప ప్రకాశరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు