నేడు పెళ్లికూతురమ్మ కల్యాణోత్సవం

14 Jan, 2019 12:51 IST|Sakshi
ఉత్సవాలకు ముస్తాబైన పెళ్లికూతురమ్మ ఆలయం

పశ్చిమగోదావరి, ఆచంట: సంక్రాంతికి ఆచంట, పరిసర మండలాల ప్రజలకు పెళ్లికూతరురమ్మ తిరునాళ్లు ఏటా ఓ మధురానుభూతిని మిగులుస్తాయి. రెండు రోజులపాటు జరిగే తిరునాళ్లలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆంచంట, పెనుగొండ మండలాల సరిహద్దులోని పెళ్లికూతురమ్మ చెరువులో పచ్చటి పంట పొలాల మధ్య పెళ్లికొడుకు.. పెళ్లికూతురమ్మలకు ఆలయం నిర్మించి ఏళ్ల తరబడి వారిని దైవంతో సమానంగా కొలుస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు.

పూర్వీకుల కథనం ప్రకారం..
ఆచంటకు చెందిన యువతికి పెనుగొండకు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరుగుతుంది. వరుడు పెనుగొండ నుంచి పల్లకిలో వివాహానికి తరలివస్తుంటాడు. మార్గ మధ్యంలో వరుడు లఘుశంక తీర్చుకోవడానికి పల్లకి దిగివెళతాడు. ఆ క్రమంలో అతనికి పాము తారస పడుతుంది. వరుడు వెంటనే తన వెంట ఉన్న ఖడ్గంతో దాని శిరస్సు ఖండిస్తాడు. అనంతరం పల్లకిలో వెళ్లిపోతాడు. వివాహానంతరం నవ దంపతులు ఇద్దరు పల్లకిలో వరుడు ఇంటికి పయనమవుతారు. పామును శిరచ్ఛేదనం చేసిన ప్రాంతానికి వచ్చే సరికి వరుడు పల్లకి ఆపి ఆ  పాము పరిస్థితి పరిశీలించడానికి వెళతాడు. అప్పటికీ జీవించి ఉన్న ఆపాము వరుడుని కాటేయడంతో అక్కడికక్కడే మరణిస్తాడు.

భర్త అకస్మిక మరణాన్ని తట్టుకోలేని నవ వధువు కూడా పల్లకిలోని కత్తితో పొడుచుకుని మరణిస్తుంది. కొన్ని రోజులకు పెళ్లికూతురు స్థానికులకు కలలో కనిపించి తామిద్దరం దేవునిలో ఐక్యమయ్యామని, తాము మరణించిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని కోరుతుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు పెళ్లికూతరు, పెళ్లి కొడుకును పోలిన విగ్రహాలు తయారు చేయించి ఆలయం కట్టి దైవంతో సమానంగా కొలుస్తున్నారు. దీంతో ఆ ప్రాంతానికి పెళ్లికూతురమ్మ చెరువుగా నామకరణం చేశారు.  ఏటా భోగి రోజు ఉదయం ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఆచంట తీసుకు వస్తారు. స్థానిక కుక్కలకోటి వీధిలోని చేకూరి సర్వేశ్వరరావు ఇంట్లో సోమవారం ఉదయం 9 గంటలకు కల్యాణం చేసి ఊరంతా ఊరేగిస్తారు. అనంతరం సాయంత్రానికి ఆలయానికి చేర్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. కల్యాణోత్సవం తరువాతి రెండు రోజులు ఈ నెల 15, 16 తేదీల్లో తిరునాళ్లు వైభవంగా నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు