80% వైకల్యం ఉంటేనే రూ.1500 పింఛన్

20 Jun, 2014 01:38 IST|Sakshi
80% వైకల్యం ఉంటేనే రూ.1500 పింఛన్

సాక్షి, హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందజేసే నెలవారీ పింఛన్‌ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువు, చేనేతలకు చెల్లించే పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచారు. 40 శాతం నుంచి 79 శాతం వరకు అంగకవైకల్యం ఉన్న వారికి వెయ్యి.. 80 శాతం, ఆపైన అంగవైకల్యం ఉండేవారికి 1,500 రూపాయలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామని ప్రకటన చేసి ఈ మేరకు తాను ప్రమాణస్వీకారం చేసే రోజు ఫైలు సంతకం చేశారు. అయితే ఎన్నికల సందర్భంగా వికలాంగులందరికీ రూ. 1500 చెల్లిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు తీరా అమలు విషయానికి వచ్చే సరికి ఆంక్షలు మొదలు పెట్టారు.

ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారు రూ.500 ఫించనును కోల్పోవాల్సి వస్తోంది. లబ్ధిదారులకు అక్టోబరులో జరిపే చెల్లింపు నుంచి పెరిగిన పింఛన్‌లు అమలులోకి వస్తాయని గ్రామీణాభివృద్ధి ఇన్‌ఛార్జి ముఖ్యకారదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతవులు, చేనేతలకు రూ.200, 40 శాతం పైన అంగవైకల్యం ఉన్న వికలాంగులందరికీ రూ.500 పింఛన్ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు