ఆంక్షల్లేకుండా పింఛన్లు

31 Mar, 2020 13:30 IST|Sakshi
పింఛన్ల వివరాలు తెలుసుకుంటున్న లబ్ధిదారులు

ఈ సారి ఫొటో ద్వారానే పింఛన్ల పంపిణీ

కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్, సంతకం లేకుండానే ఇవ్వాలని సర్కారు ఆదేశం

వైఎస్సార్‌ పింఛను కానుక నిధులు రూ.98.27 కోట్లు విడుదల

ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా పంపిణీకి చర్యలు

ఒంగోలు టూటౌన్‌: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీలో సర్కార్‌ ఆంక్షలు తొలగించింది. కరోనా నేపథ్యంలో ఈ సారి బయోమెట్రిక్, సంతకం లేకుండానే పింఛన్లు పంపిణీ చేయాలని సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో పాటు రెండు రోజుల ముందుగానే నిధులు కూడా విడుదల చేసింది. జిల్లాలో 4,11,207 మంది పెన్షన్‌దారులు ఉండగా వీరికి కేటగిరీ వారీగా ప్రభుత్వం పెన్షన్లను ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.98,27,92,750 నిధులను జిల్లా అధికారులు ముందస్తుగానే డ్రా చేశారు. వీటిని గ్రామ వలంటీర్లకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. పెన్షన్లు పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.

ఈ కేటగిరీ లబ్ధిదారులకు నెలకు రూ.2,250 పెన్షన్‌ అందిస్తున్నారు. డప్పు కళాకారులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.3000 ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్‌ను మూడింతలు పెంచి అందిస్తోంది. రూ.3,500 నుంచి రూ.10,000 పెంచి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు సకాలంలో పెన్షన్‌లు అందిస్తున్నారు. ఇంకా అభయహస్తం కింద 7,752 మంది పెన్షన్‌లు పొందుతున్నారు. వీరందరికీ ఏప్రిల్‌ ఒకటో తేదీనే పెన్షన్‌ ఇవ్వాలని సర్కార్‌ ఆదేశించింది. ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన పెన్షన్‌ నిధులను డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ బ్యాంకర్లను ఆదేశించారు. దీంతో సోమవారమే పెన్షన్‌ నిధులను డ్రా చేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. డ్రా చేసిన నిధులను గ్రామ వలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే పెన్షనర్లకు ఇంటికి వెళ్లి అందజేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పెన్షనర్ల ఫోటో మాత్రమే తీసుకుని పెన్షన్‌ అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా నివారణ నేపథ్యంలో వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెన్షన్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు