కొత్తగా పింఛన్‌ అందుకున్న1,15,269 మంది

1 Jul, 2020 11:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,15,269 మంది పింఛన్‌ డబ్బులు అందుకున్నారు. దీంతో మొత్తంగా 59.03 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్‌ డబ్బులను అందజేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయం నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దేకే వెళ్లి పింఛన్‌ డబ్బులు అందజేశారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు  పింఛన్‌ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్‌ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు.  

► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్‌ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. 

► లాక్‌డౌన్‌ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.  

► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్‌ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. 

► కాగా, జూన్‌ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్‌ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు