పింఛను వంచన

31 May, 2015 02:26 IST|Sakshi

కమిటీ పేరుతో గిట్టనివారి పేర్లు తొలగించిన తెలుగు తమ్ముళ్లు
కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వికలాంగులు, వృద్ధులు
{పభుత్వం నుంచి అనుమతి రావాలంటున్న అధికారులు

 
తెలుగు తమ్ముళ్ల పుణ్యమాని పింఛను కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం కుదించి, తమకు అనుకూలమైనవారికి పింఛను కోసం సిఫారసు చేయడంతో ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నవారు అనర్హులైపోయారు. తమ గోడు చెప్పుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు. వారేమో ప్రభుత్వం అనుమతిస్తే పింఛన్లు ఇస్తామని సెలవిస్తున్నారు.
 
ఏలూరు (టూటౌన్) : జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా పిం ఛన్లు తీసుకుంటున్న వికలాంగులు, వృద్ధులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వారిని అధికారులు తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. గ్రామస్థాయిలో తెలుగు తమ్ముళ్లతో వేసిన కమిటీ తమకు అనుకూలంగా ఉండనివారికి సంబంధించిన పింఛన్లను తొలగిస్తోంది. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
జిల్లాలో ప్రస్తుతం వృద్ధులకు లక్షా 61వేల 737, వికలాంగులకు 43వేల 667, వితంతువులకు 96వేల 196, అభయహస్తం కింద 25వేల 624, కల్లుగీత కార్మికులకు 17వేల 44, చేనేత కార్మికులకు 3వేల 170 పింఛన్లను అందచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జన్మభూమి కమిటీల పేరుతో 24 వేల పింఛన్లను తొలగించారు. వాటి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్నవారికి పింఛన్లు కేటాయిస్తూ తెలుగు త మ్ముళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బాధితులు తమకు తిరిగి పింఛన్లు ఇవ్వమని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వయసు సరిపోలేదని, అంగవైక ల్య ధ్రువీకరణ పత్రం లేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.
 
మరోపక్క అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ రాజకీయ నేతలు చెబితేనే పింఛన్లను ఇస్తున్నారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీలలో గ్రామ సర్పంచ్‌లు ఉండటంతో పింఛనుదారులకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అధికారులు మాత్రం జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన లబ్ధిదారుల జాబితానే ప్రభుత్వానికి పంపుతున్నామని, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తరువాత పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. పింఛన్లు కోల్పోయిన వారు మాత్రం ఆశ చావక ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు అందిస్తూనే ఉన్నారు. అధికారులు వీరికి ఎప్పటికి పింఛన్లు మంజూరు చేస్తారో చూడాలి.
 
 అర్హత ఉన్నా పింఛను రావడం లేదు

 నేను అర్హురాలిని అయినప్పటికీ పింఛను రావడం లేదు. అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు పింఛను వస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుంది.
 - షేక్ బీబ్, జంగారెడ్డిగూడెం.
 
 పింఛను నిలిపేశారు

 నాకు నాలుగేళ్లు వృద్దాప్య ఫించను వచ్చింది. 10 నెలల నుంచి ఆపేశారు. నా వయస్సు 65 సంవత్సరాలు. అయితే ఆధార్‌కార్డులో వయసు తక్కువగా ఉందని పింఛను ఇవ్వడంలేదు. అధిరులకు ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నాను. కానీ ఎవరూ న్యాయం చేయడంలేదు. ఇదిగో ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుందని తిప్పుతున్నారు. పింఛను రాకపోవడంతో, చేతిలో రూపాయి కూడా ఉండటంలేదు. నాకు పింఛనువస్తుందో, రాదో తెలియడంలేదు.                             
 - ఎ.అచ్చాయమ్మ, నరసాపురం
 
 

మరిన్ని వార్తలు