అవ్వాతాత ఆనందం

31 May, 2019 13:00 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ పింఛన్‌ ఫైల్‌పై సీఎం  జగన్‌ తొలి సంతకం

జూన్‌ నుంచే పింఛన్‌ పెంపు

ఇకపై ప్రతి నెలా రూ.2,250

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. జూన్‌ నుంచే పెరిగిన పింఛన్‌.. లబ్ధిదారులకు అందుతుందని ప్రకటించారు. దీంతో అవ్వాతాతల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగేళ్ల పది నెలల పాటు లబ్ధిదారులకు ప్రతి నెలా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్‌ రెండింతలు చేస్తానని, ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తానని హామీ వచ్చారు. అయితే ఆయన హామీకి లబ్ధిదారులు ఎక్కడ తన చేయి జారిపోతారోనని భయపడిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పింఛన్‌ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పెంచారు. ఈ విషయాన్ని కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందే గ్రహించి.. తన హామీని చంద్రబాబు కాపీ కొట్టబోతున్నారని, అలా జరిగితే తాను పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని పింఛన్‌ పెంపుపై పెట్టారు.  జూన్‌ నెల నుంచి పింఛన్‌ పెంపు అమలులోకి రాగా జూలై మొదటి వారంలో పింఛన్‌ మొత్తం లబ్ధిదారుల చేతికందనుంది.

3,89,343 మందికి లబ్ధి
జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌దారులు 1,60,204, వితంతు పింఛన్‌దారులు 1,62,937, వికలాంగులు 47,437, చేనేత కార్మికులు 4,574, కల్లుగీత కార్మికులు 341, హిజ్రాలు 326, ఒంటరి మహిళలు 4,952,  జాలరులు 1,316, కిడ్నీ బాధితులు 112, చెప్పులు కుట్టేవారు 1,260, డప్పు కళాకారులు 2,340, అభయహస్తం లబ్ధిదారులు 3,544 మంది కలిపి మొత్తం లబ్ధిదారులు 3,89,343 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ వర్గానికి చెందిన వారు 68,603, ఎస్టీలు 9,151, బీసీలు 2,17,898, ఓసీలు 50,200, మైనార్టీలు 43,496 మంది ఉన్నారు. పింఛన్‌ పెంపుతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.   

వెంటనే ఇవ్వడం  సంతోషం
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్‌ పెంచడం ఆనందదాయకం. ఇక వైఎస్సార్‌ పింఛన్‌తో అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు అందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది. పింఛన్ల పెంపునకు సమయం తీసుకుంటాడని అనుకున్నాం. అయితే వచ్చే నెల నుంచే ఇస్తానని ప్రకటించి జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.  –డిష్‌ బాషు, క్రిష్టిపాడు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేద ప్రజలంటే ఎంత ప్రేమ ఉందో తొలి సంతకంతోనే నిరూపించాడు. అవ్వాతాతల ఆశీర్వాదం కోరుతూ పింఛన్‌ రూ.250 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నవరత్నాల పథకాలను కచ్చితంగా అమలు చేసి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకోవడం తథ్యం.–జయమ్మ, వానాల,పాములపాడు మండలం 

మరిన్ని వార్తలు