పెన్షన్‌ కోసం వెళితే కారుందని ఇవ్వడం లేదు

27 Nov, 2018 13:21 IST|Sakshi
బాధితుడు శ్రీనివాసులు

పోలీసు గ్రీవెన్స్‌లో బాధితుడి ఆవేదన

నెల్లూరు : పెన్షన్‌ కోసం వెళితే తన పేరుతో కారుందని.. పెన్షన్‌ రాదని చెప్పారని, కారులేదని సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే పెన్షన్‌ ఇస్తామని చెప్పడంతో ఏడాదిన్నరగా బాధితుడు తనకు కారు లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వివరాలు.. కొడవలూరు మండలం కొత్తవంగల్లు పంచాయతీ బ్రహ్మారెడ్డిపాలేనికి చెందిన జాన శ్రీనివాసులు కల్లుగీత కార్మికుడు. గీత పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెకు వివాహం చేశాడు. కుమారుడిని చదివించుకుంటున్నాడు.

వయస్సు పైబడడంతో కల్లు గీసేందుకు ఆరోగ్యం సహకరించక వృత్తిని మానేశాడు. ఏడాదిన్నర క్రితం కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తును పరిశీలించిన అధికారులు  కారు యజమానివి నీకు పెన్షన్‌ రాదని అతనికి చెప్పారు. కారు ఏంటి సారూ నాకు కనీసం ద్విచక్రవాహనం కూడా లేదని చెప్పినా పట్టించుకోకుండా కారు లేనట్లుగా సర్టిఫికెట్‌ తీసుకువస్తే పెన్షన్‌ విషయం పరిశీలిస్తామని చెప్పారు. దీంతో బాధితుడు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ విచారించగా అతని పేరుపై కారు రిజిస్ట్రేషన్‌ అయి ఉందని, అందుకు సంబంధించిన జెరాక్స్‌ కాపీని అతనికి ఇచ్చారు. దీంతో శ్రీనివాసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఇది ఎలా జరిగిందని అతను ఆర్టీఓ కార్యాలయం అధికారులను అడగగా వారం రోజుల్లో పరిశీలించి తగిన న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతనిని పట్టించుకోవడం మానేరు.

గ్రీవెన్స్‌ చుట్టూ..
కారు విషయం నుంచి ఎలాగైనా బయటపడి పెన్షన్‌ సాధించుకోవాలని ఏడాదిన్నరగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తొలుత శ్రీనివాసులు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో అధికారులకు అర్జీలు ఇచ్చాడు. వారు ఆర్టీఓ కార్యాలయం అధికారులకే సిఫార్సు చేయడంతో అక్కడకు వెళ్లినా అతనికి పని జరగలేదు. పోలీసు గ్రీవెన్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సైతం అతనిని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాలని సమాధానం చెప్పారు. అయితే ఆర్టీఓ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగదని భావించిన శ్రీనివాసులు చివరకు సోమవారం ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదు చేసేందుకు పోలీసు కార్యాలయానికి వచ్చాడు. అక్కడున్న సిబ్బంది అతనిని ఇది తమ పరిధిలోది కాదని ఆర్టీఓ కార్యాలయంలోనే తేల్చుకోవాలని చెప్పడంతో చెమ్మగిల్లిన కళ్లతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగాడు.

అసలు కారు ఎక్కడుంది?
శ్రీనివాసులుకు కారుందని సర్టిఫికెట్లలో ఉంది. అయితే శ్రీనివాసులు వద్ద కారు లేదు. మరి 2015 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీనివాసులు పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సర్టిఫికెట్‌లో ఉంది. మరీ ఆ కారు ఏమైంది. అసలు శ్రీనివాసులు పేరుపై ఎవరు కారు రిజిస్ట్రేషన్‌ చేశారు? శ్రీనివాసులు లేకుండానే అతని కారుపై ఆర్టీఓ కార్యాలయం అధికారులు ఎవరికి రిజిస్ట్రేషన్‌ చేశారు? అన్న వాటిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు