మానవత్వానికి వికలత్వం!

26 Feb, 2019 13:08 IST|Sakshi
శ్రీరాములును భుజాన వేసుకుని కలెక్టరేట్‌కు వచ్చిన చెంగమ్మ

ఇతను పింఛన్‌కు అర్హుడుకాదా?

ఆధార్‌ లేదని పింఛన్‌కు ప్రతిపాదించని అధికారులు

వీరి వల్ల ప్రయోజనం లేదని పట్టించుకోని అధికార పార్టీ జన్మభూమి కమిటీ

పింఛన్‌ కోసం ఏళ్ల తరబడి పాట్లు

కదల్లేడు, మాట్లాడలేని బిడ్డకు అన్నితానై సేవలు చేస్తున్న తల్లి

అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆపై వారిది పేద కుటుంబం. ఇదే అతని జీవితానికి శాపంగా పరిణమించింది. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు నిర్దయగా వ్యవహరించారు. ఆ దివ్యాంగుడి జీవితాన్ని చూస్తే ఏ మనిషిలోనైనా మానవత్వం పెల్లుబికుతుంది. కానీ అధికార పార్టీ నేతలు, అధికారుల్లో పిసరంత కూడా మానవత్వం కానరావడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా ఆ దివ్యాంగుడి బతుక్కి పింఛన్‌ సాయం కోసం తల్లిదండ్రులు తిరగని గడప లేదు. ఎక్కని మెట్లు లేవు. అతని దయనీయ స్థితిని గుర్తించలేని ఏలికల ‘మానత్వానికి వికలత్వం’ నిదర్శనంగా నిలుస్తోంది. 

నెల్లూరు(పొగతోట): అధికారులు, అధికార పార్టీ నేతలు మానవత్వాన్ని మరుస్తున్నారు. అధికార పార్టీ వారైతే అనర్హులకు కూడా జన్మభూమి కమిటీలు పింఛన్లు మంజూరు చేస్తున్నారు. పేదవాడికి అండగా నిలవాల్సిన అధికారులు జన్మభూమి కమిటీల ఒత్తిడికి తలొగ్గి నైతిక బాధ్యతలకు తిలోదకాలు వదులుతున్నారు. నాయుడుపేట మండలం లోతగుంటకు చెందిన రంగనాథం, చెంగమ్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలు. ఇద్దరూ దివ్యాంగ బిడ్డలే. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి అన్నీ తానై సేవలు చేస్తూ కష్టపడుతోంది. పెద్ద కుమారుడు కొద్ది రోజుల క్రితం మరణించాడు. రెండో కుమారుడు శ్రీరాములు (22)కు పుట్టుకతోనే అంగవైకల్యం.. బుద్ధిమాంద్యమే కాదు.. శరీరంలో అన్ని సమస్యలే. కదల్లేడు.. మాట్లాడలేడు. మల, ముత్రాలు అన్ని తల్లే శుభ్రం చేయాలి. అసలే పేద కుటుంబం. రెక్కాడితే కానీ.. డొక్కాడని కుటుంబం. బిడ్డలను చూసుకునేందుకు తల్లి కూలి పనులకు వెళ్లడం మానుకుంది. తండ్రి కష్టంతో ఆ కుటుంబం జీవనం కష్టంగా నడుస్తోంది. దివ్యాంగుడు శ్రీరాములకు వికలాంగుల పింఛన్‌ వస్తే కొంత ఆదరువుగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు పింఛన్‌ మంజూరు కోసం అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయారు. ఇతని పరిస్థితి చూసి మానవత్వం స్పందించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు.

ఆధార్‌ లేదని పింఛన్‌ మంజూరు చేయలేదు
 శ్రీరాములకు చేతి వేళ్లు, కళ్లు సరిగా లేని కారణంగా ఆధార్‌ రాలేదు. అతనికి అధార్‌ లేని అధికారులు పింఛన్‌ మంజూరుకు కొర్రీ పెట్టారు. తల్లిదండ్రులు అతనికి ఆధార్‌ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా ఆధార్‌ మంజూరు కాలేదు. కుటుంబానికి రేషన్‌కార్డు ఉంది. శ్రీరాములకు దివ్యాంగుల పింఛన్‌ కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేశారు. ఇప్పటి వరకు పింఛన్‌ మంజూరు కాలేదు. సోమవారం తల్లి శ్రీరాములును భుజనా వేసుకుని కలెక్టరేట్‌కు తీసుకు వచ్చింది. పింఛన్‌ మంజూరు చేయలంటూ అధికారులను వేడుకుంది. అతని పరిస్థితిని చూసి స్పందించిన డీఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి డీఆర్‌డీఏ అధికారులను పిలిచి మాట్లాడారు. ఆధార్‌ లేకుండా ప్రత్యేక కేసు కింద పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిచి సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయించమని డీఆర్‌ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచిస్తే వారు.. వీరిని పక్కకు తీసుకెళ్లి మీరు పోయి తెచ్చుకోమని పంపించేశారు. ఇప్పుడు కూడా కింది స్థాయి అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించకపోవడం శోచనీయమని వీరిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అధికారులను సంప్రదిస్తే ఇదే విధంగా సమాధానం చెబుతున్నారని శ్రీరాములు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు