చచ్చినా వదలరు!

25 Jul, 2015 04:01 IST|Sakshi
చచ్చినా వదలరు!

- మృతుల పేర్లపై పింఛన్లు స్వాహా
- మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించని వైనం
- వారి ఫొటోల పక్కన నమోదవుతున్న వేలిముద్రలు
- పుష్ఠిగా ఆరగిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
- చోద్యం చూస్తున్న మైలవరం ఎంపీడీఓ
- ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప :
ఆ పండుటాకులు ఎప్పుడో కాలమైపోయినా, వారి పేరుతో నెల నెలా పింఛన్ మాత్రం వస్తోంది. వారి ఫొటోలు, పేర్ల పక్కన వేలి ముద్రలు వేసి పింఛన్ ఇప్పటికీ తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మృతి చెందిన వారు వచ్చి పింఛన్ తీసుకోవడం ఎలా సాధ్యమనే అనుమానం రావడం ఎవరికైనా సహజం. అయితే మైలవరం మండలంలో అధికారుల మాయాజాలం వల్ల ఈ అక్రమాల పరంపర కొనసాగుతోంది. మైలవరం మండలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ జాబితాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో మృతుల పేర్లు దర్శనమిస్తున్నాయి.

ఐదారు నెలల క్రితం మరణించిన వారు సైతం నేటికీ పింఛన్ తీసుకుంటున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క వద్దిరాల పంచాయతీలోని దాదాపు 10 మంది చనిపోయిన వారి పేర్లతో ప్రతినెల పింఛన్లు డ్రా అవుతున్నాయి. బెస్తవేముల పంచాయతీలో కూడా ఇదే తంతు జరుగుతోంది. దన్నవాడ, గొల్లపల్లె, చిన్న వెంతుర్ల, చిన్న కొమెర్ల తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో చనిపోయిన వారి పేర్లు కనిపిస్తున్నాయి. ఇలా మండల వ్యాప్తంగా 50 మందికి పైగా మరణించిన వారి పేర్లతో ఆయా పంచాయతీ కార్యదర్శులు పింఛన్లను స్వాహా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
వేలిముద్రల సాక్షిగా....
మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన పాణ్యం నారాయణమ్మ (పింఛన్ ఐడీ నెంబరు 486293) ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించింది. అప్పట్లో పోస్టల్ శాఖ వారు పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆమె పింఛన్‌ను నిలిపివేశారు. అయితే, మే నెలలో పింఛన్ పంపిణీ పగ్గాలు చేతబట్టిన ఆ పంచాయతీ కార్యదర్శి.. ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకున్నట్లుగా నారాయణమ్మ ఫొటో పక్కన వేలిముద్ర వేసి రూ.3 వేలు డ్రా చేసేశాడు. జూన్, జూలై మాసాల్లో కూడా బోగస్ వేలిముద్రలు వేసి ఠంచన్‌గా పింఛన్ డ్రా చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వికలాంగుడైన షట్కారి ఓబులేశు (ఐడీ నెంబరు 420693), షట్కారి నాగమ్మ (ఐడీ నెంబరు 420628)లు ఫిబ్రవరిలోనే మరణించారు.

వీరి పింఛన్లు సైతం నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం మరణించిన మేకలదొడ్డి లక్షుమ్మ (ఐడీ నెంబరు 33052), కొండమ్మ (ఐడీ నెంబరు 280576)ల పేర్లు కూడా తాజా జాబితాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బెస్తవేముల పంచాయతీకి చెందిన తంబళ్ల ఈశ్వరమ్మ (ఐడీ నెంబరు 370199), బొందల నరసింహులు (ఐడీ నెంబరు 282149), పొమెర నిలకమ్మ (ఐడీ నెంబరు 279492)ల పింఛన్లు నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. వీరందరి మరణ ధ్రువీకరణ పత్రాలు ఆనాడే అందజేసిన ఆ పంచాయతీ కార్యదర్శికి పింఛన్ల జాబితాల నుంచి వారి పేర్లు తీసి వేయడానికి ఎందుకో మనసొప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
అర్హులకు మొండిచేయి
ఎందరో వృద్ధులు, వికలాంగులు సంవత్సర కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మైలవరం మండలం చిన్నవెంతుర్లకు చెందిన గిత్తల లక్ష్మన్నకు రెండు కళ్లు పూర్తిగా కనబడవు. వంద శాతం అంధ్వత్వం ఉన్నట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు కూడా. అన్ని ధ్రువపత్రాలతో పింఛన్ కోసం లక్ష్మన్న ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మైలవరం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఈయన గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క లక్ష్మన్నే కాదు...మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 15,500 మంది వృద్ధులు, 10 వేలకు పైగా వితంతువులు, ఐదు వేల మంది వికలాంగులు, 1200 మంది చేనేతలు ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అర్హులకు ఇవ్వకపోగా దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటున్నా చూస్తు మిన్నకుండిపోతోంది.
 
పర్యవేక్షణ లోకపోవడంతోనే..
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే పింఛన్ల జాబితా నుంచి సుమారు 44 వేల మంది పేర్లను తొలగించేశారు. విచారణ పేరుతో కొన్ని నెలలు కాలాయాపన చేసి వారిలో కొందరి పేర్లను తిరిగి జాబితాలో చేర్చారు. ఇలా తొలగిపోయి మళ్లీ చేరిన వారికి తొలిసారి రెండు నెలల పింఛన్ వచ్చింది.
 
చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు రూ.1000 మింగేసి, రూ. వెయ్యి మాత్రమే అందజేశారు. ఇక కొత్తగా మంజూరైన పింఛన్‌దారుల నుంచి మొదటి నెలలో రూ.500 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతినెల వేల రూపాయల్లో ఆదాయం కళ్ల చూస్తున్నా అవినీతి కార్యదర్శుల ఆశ చావలేదు. ఏకంగా మృతి చెందిన వారి పేరు పక్కన వేలి ముద్రలు వేసుకుంటూ ఆ పాపం కూడా మూటగట్టుకున్నారు. ఇదంతా మైలవరం ఎంపీడీఓకు తెలిసినా ఆయన పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాడన్న విమర్శలున్నాయి.
 
చర్యలు తీసుకుంటాం
చనిపోయిన వారి స్థానంలో డైడ్ అని విధిగా కార్యదర్శులు నమోదు చేయాలి. ఎంపీడీఓల పరిధిలో ఇలాంటి తనిఖీ జరగాల్సి ఉంది. ఎవ్వరు కూడ ఫించన్ల పంపిణీ సందర్భంగా కార్యదర్శులకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి పేర్లతో పెన్షన్లు పొందడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- అనిల్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ

>
మరిన్ని వార్తలు