'మంత్రులు సంబరాలు మాని.. ఆదేశాలు అమలు చేయాలి'

19 Nov, 2017 19:36 IST|Sakshi

విశాఖపట్నం: రాజధాని అమరావతి నిర్మాణంపై జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఆర్థికవేత్త డాక్టర్‌ పెంటపాటి పుల్లారావు అన్నారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలతో పాలకులు కిందపడ్డా పైన ఉన్నట్టు నటిస్తూ ప్రజలను భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్జీటీ ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నాయని, వాటితో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్నట్టుగా పురపాలకశాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం, సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదన్నారు. ఆ ఉత్తర్వులను ఆయన మరోసారి చదువుకుంటే ప్రభుత్వానికి అవి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. రాజధాని నిర్మాణంపై ఇచ్చిన ఈ తీర్పుపాలకులకు కాకుండా రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే కమిటీని నియమించిందని, కనీసం మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలని, అవసరమైతే తనిఖీ బృందాలను పంపి ఎన్జీటీ విధించిన షరతులు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని, వీటిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. నదీ తీరంలో నిర్మాణాలు చేపట్టరాదని, నదీ ప్రవాహానికి ఆటంకం కలగకూడదని స్పష్టం చేసిందనన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షించాలని, ఏ పౌరుడికి ఇబ్బంది కలిగినా కమిటీకి ఫిర్యాదు చేయొచ్చని సూచించిందన్నారు. ఈ మంత్రిత్వ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చని పక్షంలో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించవచ్చని తెలిపిందన్నారు. అంతేకాదు అదనపు ప్రధాన కార్యదర్శితో మరో కమిటీని వేసి సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో చూడాలని పేర్కొందన్నారు. ఇకమీదట నదీ పరివాహక ప్రాంతంలో పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా ఒక్క మొక్క కూడా నాటకూడదని, చిన్నపాటి నిర్మాణం చేపట్టరాదని పుల్లారావు తెలిపారు. చాలా అరుదైన కేసుల్లోనే ఇలాంటి స్పష్టమైన ఆదేశాలిస్తుందని చెప్పారు. ఇవన్నీ చూస్తే ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేదని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. మంత్రులు సంబరాలు చేసుకోవడం మాని ట్రైబ్యునల్‌ ఆదేశాలను అమలు చేయాలని, నిపుణులతో చర్చించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో 5 లక్షల మంది తరలింపునకు గురవుతున్నారని దీనిపై ప్రత్యక్ష పరిశీలనకు రావాలని తాను ఎన్జీటీ చైర్మన్‌ స్వతంత్రకుమార్‌ను ఆహ్వానించానని, ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని పుల్లారావు తెలిపారు.

మరిన్ని వార్తలు