కోతల సర్కార్

1 Jun, 2015 23:39 IST|Sakshi
కోతల సర్కార్

పింఛన్.. పరేషాన్..
భరోసా లేని పేదల బతుకులు
వెంటాడుతున్న నాటి పీడకలలు
 
 పింఛన్.. గతి లేని బతుకులకు చేయూత. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వంటి అభాగ్యులకు ఆసరా. గట్టిగా అడగలేరని కాబోలు చంద్రబాబు సర్కారులో అలాంటి నిస్సహాయులకే అన్యాయం జరుగుతోంది. పెన్షన్ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని ప్రకటించుకున్న సర్కార్ అసలుకే ఎసరు పెడుతోంది. బయోమెట్రిక్, ఆధార్ సీడింగ్, డోర్‌లాక్, వలసలు, ఆస్తిపాస్తులున్నాయని జన్మభూమి కమిటీ నివేదికలు... ఇలా ఎన్నో సాకులతో సంక్షేమానికి కోత విధిస్తోంది. పింఛనుదార్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాదు గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నెలలోనూ ఏ ఒక్కరికి మొదటి రోజున పింఛను ఇచ్చిన దాఖలాలు లేవు. గత పాలనలో ఎవరైనా చనిపోతేనే పెన్షన్ మంజూరు చేసిన చంద్రబాబు నైజం గుర్తుకు వచ్చి అందరిలో భయాందోళన నెలకొంది.
 
 సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి జిల్లాలో 3.19 లక్షలకు పైగా పింఛన్లుండేవి. కానీ నేడు అవి 3.05 లక్షలకు తగ్గిపోయాయి. ఒక్క జీవీఎంసీలో ఏకంగా 62వేల పింఛన్లు ఉండేవి. కానీ నేడు కేవలం 53,596కు కుదించేశారు. ఈ లెక్కన జిల్లాలో 15వేలకు పైగా కోతపెడితే ఒక్క జీవీఎంసీపరిధిలోనే అత్యధికంగా 9వేల పింఛన్లకు కోతపెట్టారు. గతంలో టీడీపీ పాలనలో రూ.75 పింఛన్ ఇచ్చేందుకు నానా అగచాట్లు పెట్టేవారు.

ఆ రోజుల్లో ఎవరైనా కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్న వారిలో ఎవరైనా చనిపోతే అప్పుడు చూద్దాం... అంటూ హేళనగా మాట్లాడిన సందర్భాలున్నాయి. మళ్లీ ఆ దుస్థితి నిర్భాగ్యుల కళ్లెదుట కదలాడుతోంది. పింఛన్ మొత్తాన్ని ఐదురెట్లు పెంచామని ప్రకటించుకున్న సర్కార్ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నెలలోనూ ఏ ఒక్కరికి మొదటి రోజున పింఛను ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు అందుతుందో..అసలు అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో నిరుపేదలు ఆందోళనలో ఉన్నారు.

 ‘కోత’లకు సాకులెన్నో...
 వేలిముద్రలు పడడంలేదు..ఐరిష్ కాప్చర్ కావడం లేదంటూ లబ్దిదారులను ఒకటికి పదిసార్లు తిప్పించుకోవడం ఆనక వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి క్రమంగా తొలగించడం సర్కారుకు పరమావధిగా మారింది. ఇలా మూడు నెలలు క్రమం తప్పకుండా తీసుకోలేని పింఛన్‌దారుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఈ విధంగా మూడు నెలలుగా పింఛన్లు తీసుకోలేని మరో 7,229 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జూన్‌లలో కొత్తగా పింఛన్లు మంజూరు చేశామని....వీటిని జన్మభూమి మావూరు గ్రామసభల్లో పంచిపెడతామని సర్కార్ ప్రకటించింది. కానీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తే ఉన్న సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది.

 ఇవీ గణాంకాలు...
 గత నెలలో 3,09, 905 మందికి పింఛన్‌లు మంజూరు చేయగా, జూన్‌లో ఈ సంఖ్య 3,05,988కి పడిపోయింది. అంటే ఒక్క నెలలోనే 4వేల పింఛన్లకు కోతపడి ంది. ఇక ఏ విధంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేశారో అధికారులే చెప్పాలి. ప్రసుతం వృద్ధాప్య పింఛన్ల సంఖ్య 1,49,691కి చేరింది. వితంతు పింఛన్ల సంఖ్య 1,15,371కు చేరింది. ఇక వికలాంగుల పింఛన్లు 37,990 ఉండేవి. కానీ నేడు 32,404 పింఛన్లకు తగ్గిపోయాయి. ఇలా ఏ విధంగా చూసినా పింఛన్లకు కోత పడింది. గతేడాది ఆధార్ సీడింగ్, డోర్‌లాక్, వలసలు,ఆస్తిపాస్తులున్నాయని జన్మభూమి కమిటీ తనిఖీల్లో గుర్తించామనే సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టిన సర్కార్ ఆ తర్వాత రోల్‌బ్యాక్ పేరుతో జీవీఎంసీ పరిధిలో 2,158, రూరల్ పరిధిలో 3,410 పింఛన్లను పునరుద్ధరించారు.

 లక్షల్లో దరఖాస్తులు, వేలల్లో గుర్తింపు...
 గతేడాది జన్మభూమి మావూరుతో పాటు మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్ అర్జీల్లో 3.54 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 44వేల మంది అర్హులని అధికారులు గుర్తించారు. అయితే జన్మభూమి కమిటీలు మరో 20వేలకు కోత పెట్టి 24 వేల మందికే సిఫార్సు చేశాయి. వీటిలో 12,500 పింఛన్లు మాత్రమే ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీటిలో జీవీఎంసీ పరిధిలో 4,623, రూరల్ పరిధిలో 8,200 మాత్రమే మంజూరు చేశారు. వీటితో కలుపుకొని జూన్‌లో 3,05,988 పింఛన్‌లు మంజూరు చేశారు. ఇంకొక చిత్రమేమిటంటే కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పుడు బడ్జెట్ కేటాయింపులు పెరగాలి. కానీ మేలో రూ. 34.76 కోట్లు జిల్లాకు కేటాయిస్తే, జూన్‌లో ఈ మొత్తం రూ.32.92 కోట్లకు కుదించారు.
 
 ప్రభుత్వం మా ఉసురు పోసుకుంది..
 గత ప్రభుత్వ హయాంలో రూ.60, తరువాత రూ.200 పించను వచ్చేది. ముగ్గురు కొడుకులున్నా కూలిపనులు లేకపోవడంతో వారికడుపే నిండడం కష్టంగా ఉంది. ఇపుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక మా ఉసురు పోసుకుంది. పించను ఆపేసింది. గతంలో గొప్పగా బతికేవాళ్లమని తెలియడం కోసం తెల్లచొక్కా తొడుక్కుంటున్నా లోపల మాత్రం చిరుగులే. నా వయసు ఎనభై పైబడుతుంది. ఈ వయసులో పించను ఆపేయడంతో దిక్కు తోచడం లేదు. పించను తొలగించకుండా ఉంటే కొండంత ఆసరాగా ఉండేది. ప్రభుత్వం ఇపుడా ఆశ కూడా లేకుండా చేసింది.
 -కె.పైడన్న, భీమిలి మండలం
 
 కదల్లేకపోయినా కనికరం లేదు..
 పెందుర్తి మండలంలోని రాంపురం పంచాయితీ బాపూజీనగర్‌కు చెంది న కేసుబోయిన రాజశేఖర్(19)కు కాళ్ళు పనిచేయవు. మాటలు రావు. కళ్ళు కూడా సరిగా కనపడవు. తల్లిదండ్రులు అప్పారావు, లక్ష్మి కూలి పనులు చేసుకుంటున్నారు. చిన్నపాటి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కేజీహెచ్‌లో నిర్వహించిన సదరం క్యాంప్‌లో డాక్టర్లు ఇతడ్ని 90 శాతం వికలాంగుడిగా నిర్ధారించి సర్టిఫికేట్ ఇచ్చారు. దీని ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే వికలాంగ పింఛన్‌కు దరఖాస్తు చేశారు.  జన్మభూమి కమిటీ, స్థానిక నాయకులు, జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం.  అన్ని అర్హతలు ఉండి కూడా  పింఛన్ మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 కూలి కెళ్లాల్సి వస్తోంది...
 టీడీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల రూ.200 పింఛన్ సొమ్ము అందేది. దీంతో కొంత భరోసా ఉండేది.  టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న పింఛను కాస్తా తీసేశారు. నా పేరు మీద 6 ఎకరాల భూమి ఉందని పింఛను తీసేశారు. నిజానికి నా పేరు మీద భూమి ఉన్నా అది సాగులోకి లేదు. నిరుపయోగంగా ఉంది.  భూములన్నీ నా కుమారుల ఆధీనంలోనే ఉన్నాయి. నేను ఒంటరిగానే నివసిస్తున్నాను. ఈ ఏడాది జనవరి నెల నుంచి పింఛన్ సొమ్ము ఇవ్వడం లేదు.  ప్రస్తుతం నాకు 65 ఏళ్ళు నిండింది. ఈ వయస్సులో కూడా కూలిపనులు చేసుకోవాల్సి వస్తుంది.  
 -బార్జా రాములమ్మ, దబ్బాపుట్టు, పాడేరు మండలం

మరిన్ని వార్తలు