విచారణకు సహకరించని డాక్టర్‌ అనితా రాణి

10 Jun, 2020 14:29 IST|Sakshi

సీఐడీ అధికారులు విచారణకు రావొద్దు 

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు అనితా రాణి సీఐడీ విచారణకు సహకరించడం లేదు. అధికారులు ఫోన్‌ చేసినా ఆమె స్పందించకపోవడంతో వారే..స్వయంగా అనితా రాణి నివాసానికి వెళ్లారు. సీఐడీ అధికారులను చూడగానే అనితా రాణి ఇంటి తలుపులు వేసుకున్నారు. ‘నాకు సీఐడీ పోలీసులపై నమ్మకంలేదు. నన్ను విచారించడానికి మీరు ఎవరూ కూడా నా ఇంటి వద్దకు రాకండి. మీరు పిలిచినా నేను రాను. నా కేసు సీబీఐతో విచారించాల్సిందే..’ అంటూ ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి పేర్కొన్నారు.  ఆమెను విచారించడానికి చిత్తూరుకు చేరుకున్న సీఐడీ పోలీసులు నిన్న (మంగళవారం) అనితారాణికి ఫోన్‌చేయగా.. ఆమెనుంచి ఇలాంటి సమాధానం వచ్చింది. దాంతో సీఐడీ అధికారులు బుధవారం ఆమె నివాసానికి వెళ్లగా...అధికారులను చూడగానే తన నివాసంలో తలుపులు మూసివేశారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం)

కాగా ఈ ఏడాది మార్చి 22వ తేదీ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భరత్‌ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకున్నారు. ఇదేమిటని గ్రామస్తులు నిలదీయడంతో తనను కులం పేరిట ధూషించారని, బాత్‌రూమ్‌లో ఉంటే ఫొటోలు తీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉంటూ వైద్యసేవలు అందివ్వలేదంటూ భరత్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఇంతలో తనకు న్యాయం జరగలేద ని అనితారాణి మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. విచారించడానికి చిత్తూరుకు వచ్చిన సీఐడీ పోలీసులు అనితారాణిని ఫోన్‌లో సంప్రదించగా ఆమె నిరాకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర టీడీపీ నాయకులు దగ్గరుండీ మరీ వివాదంగా మారుస్తున్నారని పెనుమూరు వాసులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు