అన్నీ కిటకిటే!

22 Mar, 2020 05:07 IST|Sakshi
మాస్క్‌లు ధరించి కూరగాయలు కొంటున్న ప్రజలు

జనతా కర్ఫ్యూతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా నిత్యావసరాల కొనుగోళ్లు

అన్ని జిల్లాల్లో క్యూ కట్టిన జనం

సరుకుల కొరత ఏర్పడుతుందేమోనని భయాందోళన

పలుచోట్ల వైన్‌షాపుల వద్ద కూడా మద్యం ప్రియుల బారులు

సాక్షి నెట్‌వర్క్‌: దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించనున్న నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతుబజార్లు, స్థానిక మార్కెట్‌లతోపాటు సూపర్‌ మార్కెట్లకు పరుగులు తీశారు. కరోనా భయాందోళనలతో వివిధ రాష్ట్రాల సరిహద్దులు మూసేస్తుండటం.. ఈ ప్రభావం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల కొరత ఏర్పడడమే కాక ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో నెల రోజులకు సరిపడా ఇంటి సామాన్లను కొనుగోలు చేసేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతున్న విజయవాడలోని రైతుబజార్‌ 

- కర్నూలు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూకు ఒకరోజు ముందే అన్ని నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని దుకాణాలు, సూపర్‌మార్కెట్లు కిటకిటలాడాయి. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో రైతుబజార్లు కిక్కిరిసిపోయాయి. 
- శ్రీకాకుళం జిల్లాలో.. సరుకుల కొరత ఏర్పడుతుందన్న ప్రచారం జరగడంతో  ప్రజలు కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల ముందు  తండోపతండాలుగా జనం కనిపించారు. రైతుబజార్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది.  నెలకు సరిపడా సరుకులు కొంటున్న వారు కనిపించారు. దీంతో కొన్ని దుకాణాలు ఖాళీ అయిపోయాయి. 
- నిత్యావసరాల కొనుగోలుదారులతో అనంతపురం మార్కెట్‌ కూడా కిటకిటలాడింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. 
- నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌ రద్దీగా మారింది. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరారు. 
- చిత్తూరు జిల్లాలోని ప్రధాన మార్కెట్లు, షాపింగ్‌ మాళ్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు కూడా జిల్లాలోని అన్ని పట్టణాల్లోని కిరాణా షాపులు, షాపింగ్‌ మాల్స్‌ జనంతో కిక్కిరిసిపోయాయి. కొందరు మాంసం ప్రియులు తమకు అవసరమైన వాటిని ఒకరోజు ముందే కొనుగోలు చేసి ఫ్రిజ్‌లలో భద్రపరుచుకున్నారు. 
- విశాఖ జిల్లాలోని అన్ని రైతుబజార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 31 వరకూ పలు దుకాణాలు, మాల్స్‌ మూసెయ్యాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. నిత్యావసరాల్ని నిల్వ చేసుకునేందుకు జనం ఎగబడ్డారు. నగరంలోని అన్ని సూపర్‌మార్కెట్లు మధ్యాహ్నం 12 కల్లా ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల వైన్‌ షాపుల వద్ద కూడా మద్యం ప్రియులు బారులుతీరారు.
- తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కూడా రైతుబజార్లలో జనం పోటెత్తారు. వారం, పది రోజులకు సరిపడా కాయగూరలు కొనుగోలు చేశారు. నిత్యావసరాల కొనుగోళ్లకు జనం పోటెత్తడంతో అన్ని రకాల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డెట్టాల్, శానిటైజర్లనూ బాగా కొనుగోలుచేశారు.

మరిన్ని వార్తలు