మారిన మనుషులు

27 Jun, 2020 05:01 IST|Sakshi

తాగుడు వ్యసనానికి దూరమవుతున్న మందుబాబులు

సమాజంలో లభిస్తున్న మర్యాదతో సగర్వంగా కొత్త జీవితం

రాజాం: మద్యం మహమ్మారి కోరలు అణచడంతో పచ్చని పల్లెల్లో ఇప్పుడు ప్రశాంతత రాజ్యమేలుతోంది. మద్యానికి బానిసై ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సమాజంలో తమకు లభిస్తున్న గౌరవ మర్యాదలతో ఇన్నేళ్లుగా తామేం కోల్పోయామో తెలుసుకుని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాగుడుకు డబ్బుల కోసం తాము వేధించిన కుటుంబీకుల చేతుల్లోనే కష్టార్జితాన్ని పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వేలాది కుటుంబాల్లో ఇప్పుడీ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జన దృష్టితో ఆలోచించకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మద్య నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటమే ఈ పెను మార్పులకు కారణం. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ హయాంలో 237 మద్యం దుకాణాలుండగా ప్రస్తుతం 187 మాత్రమే మిగిలాయి. గతంలో 1,203 బెల్టు షాపులుండగా ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడంతో గ్రామాలు ఘర్షణలకు దూరంగా ఉన్నాయి. గతేడాది జిల్లాలో 563 రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది ఇప్పటివరకు 134 ఘటనలే నమోదయ్యాయి. 

అంతా గౌరవిస్తున్నారు 
గతంలో మా గ్రామంలో బెల్టుషాపులు వద్ద మద్యం ఏరులై ప్రవహించేది. రాజాంలో వైన్‌షాపులు నిత్యం తెరిచి ఉండేవి. రెస్టారెంట్‌లు రాత్రిపగలు పనిచేసేవి. ఏడాది నుంచి ఇవన్నీ కట్టడి అయ్యా యి. నాకు మద్యం అలవాటు ఉండటంతో తొలుత ఇబ్బంది పడ్డా. ధరలు పెరగడంతో నాలుగు నెలలుగా మద్యం జోలికి పోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రోజూ చక్కగా పొలం పనులు చేసుకుంటున్నా. గతంలో తలనొప్పి, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఉండేవి. భోజనం తినాలని అనిపించేది కాదు. ఇప్పుడు మూడు పూటలా తింటున్నా. నా కుటుంబంలో ఇప్పుడు నాకెంతో గౌరవం ఉంది. మా ఊర్లో, సమాజంలో నా మాటకు విలువ పెరిగింది. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నిజంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాకు దైవంతో సమానం. 
–శనపతి జంపయ్య, పొగిరి గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా 

డబ్బులు నీళ్లలా ఖర్చయ్యేవి.. 
మద్యానికి బానిస కావడంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో మా గ్రామంలో బెల్టు షాపులుండటంతో తాగుడుకు డబ్బులు నీళ్లలా ఖర్చయ్యేవి. ఇప్పుడు వీటిని నిర్మూలించడంతో నాతో పాటు చాలామంది ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. అనారోగ్య సమస్యలు కూడా తీరిపోవడంతో కుటుంబంతో సంతోషంగా ఉన్నా.
–ఆవాల అనంతరావు, వన్నలి గ్రామం, రేగిడి మండలం

యువతలో పెను మార్పు
గ్రామాల్లో ఊరేగింపులు జరిగితే యువకులు పూటుగా తాగి చిందులు వేసేవారు. గొడవలు కూడా అయ్యేవి. ఇప్పుడు ఆ సమస్య తప్పిపోయింది. కఠినంగా మద్య నియంత్రణ, ధరలు భారీగా పెరగడంతో ఎవరూ దానిజోలికి పోవడం లేదు. యువత అంతా ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోసం ఆలోచిస్తున్నారు.
 –గార హరిబాబు,  మందరాడ, సంతకవిటి మండలం  

మరిన్ని వార్తలు