కరోనాపై కదనం..!

21 Mar, 2020 12:42 IST|Sakshi
ఇంద్రకీలాద్రిపై నూతన వధూవరులకు ఫీవర్‌ చెక్‌ చేస్తున్న సిబ్బంది

అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు..

ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు కట్టడి

అనుక్షణం అప్రమత్తంగా యంత్రాంగం

అత్యవసరమైతే తప్ప బయటకు రాని జనాలు

విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల స్వీయ నిర్బంధం

జిల్లా వ్యాప్తంగా జనసమ్మర్థ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

అన్ని విద్యా సంస్థలు, థియేటర్లు, మాల్స్‌ మూసివేత దుర్గమ్మ దర్శనానికీ బ్రేక్‌

ఎన్నడూ ఎదురవ్వని విపత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ‘డ్రాగన్‌’ వైరస్‌ కోరలు చాచడంతో సహజంగానే ప్రజల్లో ఆందోళన స్థాయి కొంచెం ఎక్కువగానే ఉంది.. దీనికితోడు అపోహలు, వదంతులు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు జనాల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. మరోవైపు బాధ్యతగల పౌరులు ఎవరికి వారు తమకు తాము రక్షించుకుంటూనే ఎదుటివారిని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం తమ దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా  బంద్‌ వాతావరణం నెలకొంది.

సాక్షి, అమరావతిబ్యూరో: ప్రస్తుతం జిల్లాలో జన జీవనం స్తంభిస్తోంది. ఎంతో ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రజలు ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. కరోనా వైరస్‌ వివిధ రంగాలపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న థియేటర్లు, మాల్స్‌ను ఈ నెల 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఒకవైపు శుక్రవారం ఎక్కడికక్కడ స్తబ్ద వాతావరణం నెలకొని కనిపించగా.. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల విదేశాల నుంచి జిల్లాలోని వివిధ పట్టణ, నగరాలకు వచ్చిన వారి జాబితానుపరిశీలిస్తున్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు, ఆరోగ్యం ఎలా ఉందో వివ రాలు తీసుకుంటున్నారు. వ్యాధి లక్షణాలుంటే వెంటనే వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తగ్గిన ప్రయాణాలు..  
దూర ప్రాంత ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రయాణికులు కరవు కావడంతో ఆర్టీసీ బస్సులతో పాటు, పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో పండిట్‌ నెహ్రూ బస్టాండ్, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తవడంతో పెద్దఎత్తున విద్యార్థులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో.. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకూ విజయవాడ బస్తాండ్‌ రద్దీగా కనిపించింది. సాయంత్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీతో పాటు టీఎస్‌ ఆర్టీసీ మొత్తం 100 బస్సుల వరకూ తగ్గించాయి. హైదరాబాద్‌కు ప్రతిరోజూ 80 బస్సులు(అన్ని రకాల) బస్సులు వెళ్తుంటాయి. శుక్రవారం ప్రయాణికుల రద్డీ తగ్గడంతో 40 బస్సులను ఏసీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది. అలాగే బెంగళూరుకు 4 బస్సులు, చెన్నైకు 4 బస్సులను రద్దు చేసింది. 

సిటీ సర్వీసులు 10 శాతం రద్దు..  
విజయవాడలో ప్రతిరోజూ 450 సిటీ బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయితే కరోనా దెబ్బకు ప్రజలు అప్రమత్తం కావడంతో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయడం లేదు. ఆ ప్రభావం ఆర్టీసీ సిటీ బస్సులపై పడింది. దీంతో అధికారులు శుక్రవారం రోజు 50 బస్సులను రద్దు చేశారు. శనివారం కూడా మరో 50 సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు. 

విద్యార్థులు ఇంటిబాట
ఇంటర్‌ పరీక్షలు అయిపోయినంత మాత్రాన విద్యార్థులు సొంత ఊరిబాట పట్టరు. ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువులను ఉద్దేశించి వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు పెట్టే ప్రవేశ పరీక్షలకు మరింత ముమ్మరంగా చదువుతుంటారు. వీరి చదువులపై కరోనా వైరస్‌కి సంబంధించి ప్రభావం చూపింది. ప్రభుత్వం కళాశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించడంతో వారిని సొంత ఊళ్లకు కళాశాలల యాజమాన్యాలు పంపించేస్తున్నాయి. కళాశాలలు మొత్తం మూసేస్తున్నారు. ప్రత్యేక తరగతులను కూడా రద్దు చేశారు. 

పలు అనుమానిత కేసులు
అయితే శుక్రవారం జిల్లాలో పలు కరోనా వైరస్‌ అనుమానిత కేసులు రావడంతో పరీక్షల నిమత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫ్రాన్స్‌ నుంచి ఢిల్లీ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఓ విద్యార్థినిని కరోనా వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించారు.  విజయవాడ వన్‌టౌన్‌లో కరోనా అనుమానితుడిని అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అతనిని ఐసోలెటెడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. అలాగే కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక వ్యక్తిని శుక్రవారం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వైద్యులు విజయవాడ తరలించారు.

ప్రత్యేక కమిటీల నియామకం..
మరోవైపు కరోనా వైరస్‌ నివారణలో భాగంగా అన్ని ప్రభుత్వశాఖలను కూడా దీనిలో భాగస్వామ్యం చేసేలా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌  ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా గ్రామ, మండల డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు