ప్రైవేటుకిచ్చినా ప్రశ్నించే వీల్లేదు

18 May, 2015 04:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరిట సమీకరించిన భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహం అమలు చేసింది. రైతుల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా, ఏరకంగా వినియోగించుకున్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది. సమీకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. వాస్తవానికి దీనికి ముందునుంచే రైతులతో చేసుకుంటున్న ఒప్పందపత్రాల్లో అందుకనుగుణంగా షరతులు విధించింది.

భూములు ప్రైవేటువారికిచ్చినా రైతులు ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని 9.14 ఒప్పందపత్రాల్లో 15వ షరతుగా పేర్కొంది. తద్వారా భూములపై సర్వ హక్కులు సీఆర్‌డీఏకే లభించేలా చూసుకుంది. భూములిచ్చిన రైతులకు మాత్రం వాటిపై ఎటువంటి హక్కులు లేకుండా, కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ షరతుల గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే చాలామంది రైతులు 9.14 పత్రాలపై సంతకాలు పెట్టి సీఆర్‌డీఏ అధికారులకు ఇచ్చారు.

 కోర్టుకెళ్లడమూ చట్ట విరుద్ధమే!
 భూములపై సర్వహక్కులు ఉండేలా చూసుకున్న సీఆర్‌డీఏ.. ఆ భూములపై ఏవైనా బకాయిలుంటే మాత్రం మళ్లీ రైతుల వాటా నుంచే మినహాయించుకునే వెసులుబాటు కల్పించుకుంది.ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మించి రైతులు అదనంగా ఎటువంటి పరిహారం అడగకుండా ఉండడంతోపాటు కనీసం దానిపై నిరసన తెలిపే హక్కు కూడా రైతుకు లేకుండా చేశారు. కనీసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఒప్పందాలు చేసుకున్న రైతులకు లేదు. ఒకవేళ దాఖలు చేసినా అవి చెల్లుబాటు కావని అలా చేయడం చట్టవిరుద్ధమని ముందే ఒప్పందంలో పేర్కొన్నారు.

 సీఆర్‌డీఏదే అంతిమ నిర్ణయం
 తనకు అనుకూలంగా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రభుత్వం.. ఒకవేళ ఏ కారణంతోనైనా భూసమీకరణ పథకాన్ని కొనసాగించకపోయినప్పటికీ రైతు మాట్లాడేందుకు వీల్లేకుండా కూడా చూసుకుంది. ఎటువంటి కారణం లేకుండా, ఏ సమయంలోనైనా భూసమీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం సీఆర్‌డీఏకు ఉంటుంది.
 

మరిన్ని వార్తలు