భయం వీడి... బతుకు పోరులో

23 May, 2020 05:08 IST|Sakshi

మనోనిబ్బరంతో జనం ముందడుగు

కరోనా భయాలను వీడి సాధారణ స్థితికి జనజీవనం

రోడ్డెక్కిన వాహనాలు

తెరుచుకుంటున్న దుకాణాలు

ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు

పొలం పనుల్లో రైతులు

జాగ్రత్తలు పాటిస్తూనే పనుల్లోకి ప్రజానీకం

సాక్షి, అమరావతి: సుదీర్ఘంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో స్తంభించిన జనజీవనం మళ్లీ గాడిన పడుతోంది. కరోనా వైరస్‌ పట్ల మితిమీరిన భయం అవసరం లేదన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రజలు మనోనిబ్బరంతో ముందడుగు వేస్తున్నారు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు దోహదం చేశాయి. ప్రధానంగా రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సూచించింది. గతంలోనే వ్యవసాయ పనులకు అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయటకు వస్తున్నారు. రోడ్ల మీద జన సంచారం కనిపిస్తోంది. అన్ని రకాల కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. వేసవి కావడంతో ఏసీలు, కూలర్ల అమ్మకాలపై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. అన్ని పరిశ్రమలు ఉత్పత్తిని పునఃప్రారంభించాయి. టేక్‌అవే హోటళ్ల వ్యాపారం జోరందుకుంది. తోపుడుబళ్ల నుంచి చిన్న చిన్న వ్యాపారాల వరకు అన్నీ గాడిలో పడుతున్నాయి. రైతు బజార్లలో సందడి కనిపిస్తోంది. 

వాహనాల సందడి...
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో 1,500 ఆర్టీసీ బస్సులను నడిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించడం ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి చోట్ల ఆర్టీసీ బస్టాండ్ల వద్ద బస్సులు ఎక్కేందుకు క్యూలు కనిపిస్తుండటం ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. రాష్ట్రంలో దాదాపు 25 వేల లారీ సర్వీసులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తు రవాణా జరుగుతోంది. 

పరిశ్రమల్లో ఊపందుకున్న ఉత్పత్తి
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రీస్టార్ట్‌ పథకం కింద మూడు రోజుల్లో 12,312 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ పునఃప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లోనే 100 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుందని పారిశ్రామికవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.  

గాడిన పడిన ఆక్వా రంగం
లాక్‌డౌన్‌తో ఆక్వా రంగం దెబ్బతింది. ఎగుమతులు లేక రైతులు, బ్రోకర్లు, ప్లాంట్‌ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్‌ మద్దతు ధర ప్రకటించి సుమారు 60 – 70 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేసిన ఆక్వా రైతులను ఆదుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో ఆక్వా రంగం కూడా మళ్లీ ఊపందుకుంది. 

జాగ్రత్తలు పాటిస్తూ జీవన సమరం..
కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే జీవితాలు నిలబెట్టుకోవాలనే సంకల్పంతో తిరిగి విధులకు హాజరవుతున్నాం. మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లను వాడుతూ విధులు నిర్వర్తిస్తున్నాం’    
– నాయుడు, సీకాన్‌ ఇండస్ట్రీ,ఆటోనగర్‌ అక్కిరెడ్డిపాలెం.

నెలలో వాహనాల విక్రయం పెరుగుతుంది..
‘లాక్‌డౌన్‌ సడలింపులతో ఉగాదికి ముందు బుక్‌ చేసుకున్న వాహనాలను కొనుగోలుదారులు తీసుకువెళుతున్నారు. ఆంక్షలు పూర్తిగా తొలగిస్తే నెల రోజుల్లో ద్విచక్ర వాహనాల వ్యాపారం పుంజుకుంటుంది. అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి’ 
– శ్రీనివాస్, సీఈఓ, వరుణ్‌ బజాజ్‌ 

వ్యాపారాలు గాడిన పడుతున్నాయి
‘లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో రాష్ట్రంలో వ్యాపార  సంస్థల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాపారాలను పునఃప్రారంభిస్తున్నారు. కరోనా భయాన్ని వీడి వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకునేలా మా చాంబర్‌ చర్యలు తీసుకుంటోంది’
– వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడు, ఏపీ ఫెడరేషన్‌  ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ

మంచి ధరకు ధాన్యాన్ని విక్రయించా..
‘8 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. లాక్‌డౌన్‌తో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందాం. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇవ్వడంతో ధాన్యాన్ని మంచి ధరకు విక్రయించాం. రైతులందరూ ఆనందంగా ఉన్నారు’
– దూనబోయిన లక్ష్మణరావు , కండ్రిగ,కొత్తపేట మండలం, తూర్పుగోదావరి జిలా

ఉత్సాహంగా విధుల్లోకి...
‘మళ్లీ విధుల్లో చేరడం ఉత్సాహంగా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తా. ప్రయాణికులు భౌతికదూరం, జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సు ఎక్కటానికి ముందే అందరూ శానిటైజర్‌ను వినియోగించేలా చేస్తున్నాం’ 
– ఎస్‌డీ ఇంతియాజ్, ఆర్టీసీ డ్రైవర్, వెంకటగిరి డిపో

పనులు దొరుకుతున్నాయి 
‘వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో చేతినిండా పని దొరుకుతోంది. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నాం. ఉపాధి హామీ పనులు కూడా ఉన్నందున  ఇబ్బంది లేదు.’
– బెవర అప్పన్న, రైతుకూలీ, బెలమర గ్రామం, పోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా.

1. విజయవాడ పటమట సెంటర్‌లో బ్యాగ్‌ కుడుతున్న కార్మికుడు
2. విశాఖలోని మొబైల్‌ దుకాణంలో కొనుగోలుదారులు
3. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తిరిగి ప్రారంభమైన సా మిల్లు
4. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో రోడ్డు పక్కన బట్టలు అమ్ముతున్న చిరు వ్యాపారులు
5. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద తెరుచుకున్న పూలదుకాణం  
6. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సైకిల్‌ షాపులో పని చేసుకుంటున్న కార్మికుడు
7. మచిలీపట్నంలో మండుటెండలోనూ మామిడి పండ్లు అమ్ముతున్న అవ్వ

ముమ్మరంగా సాగు పనులు..
ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 49.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసింది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో రైతన్నలు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఆన్‌లైన్‌లో విత్తనాల విక్రయాలు అందుబాటులో ఉండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు రబీ పంటల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్‌లు, మండీలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి.

ప్రభుత్వ చర్యలతో భరోసా..
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ప్రభుత్వం సమర్థంగా కరోనాను కట్టడి చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు డిశ్చార్జిలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక కంటైన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ పకడ్బందీగా ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో ప్రజల్లో భరోసా పెరిగింది.

రవాణా రంగానికి పూర్వకళ..
‘లాక్‌డౌన్‌ సడలింపులతో తిరిగి కోలుకుంటామన్న ఆశ ఉంది. పరిశ్రమలు తెరచుకుంటున్నాయి. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. ఉత్పత్తి మొదలవుతోంది. ఇవన్నీ రవాణా ఊపందుకోవడానికి దోహదం చేస్తుంది. లారీలకు గిరాకీ పెరుగుతుంది’
–వైవీ ఈశ్వరరావు,లారీ యజమాని, విజయవాడ.

సడలింపులతో హోటళ్లకు ఊరట..
‘హోటల్‌లు  ప్రస్తుతం ఆన్‌లైన్‌ సేవలు నిర్వహించేలా సడలింపులు ఇచ్చారు. సాయంత్రం 7 గంటల వరకు రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేసుకోవచ్చు. ఇది కొంత ఊరట నిచ్చే విషయం. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లకు కమీషన్లు ఇవ్వాలి కాబట్టి ఏమీ మిగిలే పరిస్థితి లేదు. ప్రజలను అనుమతిస్తే పార్శిళ్లు తీసుకెళతారు. మాకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది’
– జి సాంబశివరావు, హారిక రెస్టారెంట్‌

మరిన్ని వార్తలు