బాబోయ్‌ దొంగలు..

5 Mar, 2020 11:24 IST|Sakshi
సెల్‌ఫోన్‌ చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల

పెద్దాసుపత్రిలో భద్రత కరువు

సెక్యూరిటీ సిబ్బంది సేవలు నామమాత్రం

యథేచ్ఛగా దొంగతనాలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు, అధికారులు

పెద్దాస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో కు.ని ఆపరేషన్‌ కోసం వచ్చిన ఓ బాలింత నుంచి గత ఫిబ్రవరిలో గుర్తుతెలియని మహిళ మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న శిశువును అపహరించింది. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లు ఏవీ పనిచేయకపోయినా ఓ వ్యక్తి అనుమానంతో గుర్తుతెలియని మహిళను వీడియో తీయడంతో కొన్ని గంటల్లోనే పోలీసులు శిశువును తల్లికి అప్పగించగలిగారు.  ఆసుపత్రిలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల వార్డులో గత గురువారం చికిత్స పొందుతున్న బొంగుల బజార్‌కు చెందిన వైఎం శ్రీనివాసులు వద్ద ఉన్న మొబైల్‌ఫోన్‌ను తస్కరించారు. శ్రీనివాసులు రాత్రి నిద్రిస్తూ తలగడ కింద సెల్‌ఫోన్‌ పెట్టుకున్న విషయాన్ని గుర్తించి దొంగ మరీ చోరీ చేశాడు. 

కర్నూలు(హాస్పిటల్‌): ఆసుపత్రిలో ఇలాంటి దొంగతనాలు ప్రతిరోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి వచ్చిన వారి నగదు, వస్తువులు పోగొట్టుకుని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఆసుపత్రిలో వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 3వేల మందికి పైగా ఓపీ రోగులు చికిత్స కోసం జిల్లాతో పాటు కడప, అనంతపురం, ప్రకాశం, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపురం, బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా 2వేల మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటారు. రోగులకు సహాయంగా మరో 5వేల మంది ఆసుపత్రిలో తిరుగుతుంటారు. ఈ మేరకు రోజూ 10వేల మంది రోగులు, వారి సహాయకులు, మరో 2వేల మందికి పైగా వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది తిరుగుతుంటారు.

ఆసుపత్రిలో 180 మంది సెక్యూరిటీ గార్డులను గత ప్రభుత్వంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ నిర్వహించేది. ప్రస్తుతం ఆసుపత్రి అధికారులే సెక్యూరిటీ గార్డుల జీతభత్యాలు ఇస్తున్నారు. ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగాల్లో 24 మంది సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో పనిచేసిన ఏజెన్సీ సెక్యూరిటీ గార్డులకు సక్రమంగా జీతభత్యాలు ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగాలు మానేశారు. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య ఆసుపత్రి విస్తీర్ణం రీత్యా సరిపోవడం లేదు. ఉన్న వారిలో చాలా మంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆసుపత్రిలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారనే కనీస వివరాలు పరిశీలించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అపరిచిత వ్యక్తులు, దొంగలు ఆసుపత్రిలో యథేచ్ఛగా తిరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. రాత్రీ పగలూ ఆసుపత్రిలో తిరుగుతూ దొంగతనాలకు అనువైన వాతావరణం, వ్యక్తులను, ప్రాంతాలను గుర్తిస్తూ సులభంగా చోరీలకు పాల్పడుతున్నారు.  

సీసీ కెమెరాల పనితీరుఅంతంత మాత్రమే..
ఆసుపత్రిలో ప్రతి విభాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతి నెలా ఆసుపత్రి నుంచి నిధులు చెల్లించాల్సి ఉంది. అయితే కొన్ని నెలలుగా అధికారులు సదరు సంస్థకు నిధులు విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు సైతం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆర్‌ఎంవోను నియమించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు భద్రతను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు