కొండనిండా జనం.

16 Jun, 2014 02:12 IST|Sakshi
కొండనిండా జనం.

క్యూల్లో భక్తుల మధ్య తోపులాట  వెంకన్న దర్శనానికి 20 గంటలు
 
 
తిరుమల: తిరుమల కొండపై ఆదివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజులుగా భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. బస్టాండ్, గదులు, తలనీలాలు, శ్రీవారి దర్శనం.. అన్ని చోట్లా  బారులు తీరిన భక్తులతో నిండిన క్యూలే దర్శనమిస్తున్నాయి.  అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చిన వేలాది మంది భక్తులతో  నారాయణగిరి ఉద్యావనం కిటకిటలాడుతోంది.  క్యూల్లో జనం కిక్కిరిసిపోవడంతో పలుమార్లు తోపులాటలు జరిగాయి. వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,049 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల కిలోమీటరు వరకు క్యూలో వేచి ఉన్నారు. వీరికి 20 గంటల తర్వాత దర్శనం లభించనుంది. కాలినడక భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం ఉదయం 11గంటలకే నిలిపివేశారు. అప్పటికే క్యూలోకి వెళ్లిన భక్తులకు 6 గంటల తర్వాత ఆలయంలోకి   అనుమతించారు. ఇక రద్దీ వల్ల గదులు, లాకర్ల కోసం యథావిధిగా భక్తులు నిరీక్షించక తప్పలేదు. కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు నాలుగు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు