ఆ గ్రామాలు..శోక సంద్రాలు

11 Feb, 2014 04:52 IST|Sakshi

నిజాంసాగర్/బిచ్కుంద, న్యూస్‌లైన్ : బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి, మద్నూర్ మండలంలోని లక్ష్మాపూర్, మొగ గ్రామాలు శోక సంద్రాలయ్యాయి. జుక్కల్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపన్‌పల్లికి చెందిన రాజు, లక్ష్మాపూర్‌కు చెందిన గంగవ్వ, లక్ష్మీబాయి, మొగ గ్రామానికి చెందిన బస్వంత్, అనుష్క మరణించిన విషయం తెలిసిందే. సోమవారం వారి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 గోపన్‌పల్లికి చెందిన రాజు ఐదుగురు అన్నదమ్ములలో మూడోవాడు. తండ్రి అనారోగ్యంతో మరణించాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. బంధువుల పెళ్లి ఉండడంతో ఆదివారం మహమ్మద్‌నగర్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో మరణించాడు. శుభ కార్యానికి వెళ్లిన వ్యక్తి విగత జీవుడై శ్మశానానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు రోదిస్తున్నారు.


 లకా్ష్మపూర్ గ్రామానికి చెందిన సర్డెవార్ గంగవ్వ, సర్డెవార్ లక్ష్మీబాయి కూలీలుగా పనిచేసేవారు. పిల్లలను పెద్దకొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో చదివిస్తున్నారు. వారిని చూసి రావడానికి ఆదివారం హాస్టల్‌కు వెళ్లారు. పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని ఇంటికి పయనమయ్యారు. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని అనంత లోకాలకు తీసుకొని వెళ్లింది. కొద్ది సేపటి క్రితం తమతో మాట్లాడి వెళ్లిన వారు కానరాని లోకాలకు వెళ్లారంటే ఆ హాస్టల్ విద్యార్థులు నమ్మలే కపోతున్నారు.

 మొగకు చెందిన బస్వంత్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కూతురు పెద్దకొడప్‌గల్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం నాడు భార్య కూలి పనులకు వెళ్లింది. హాస్టల్‌లో ఉన్న పెద్ద కూతురును చూసిరావడానికి బస్వంత్ చిన్న కూతురు అనుష్కతో కలిసి వెళ్లాడు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు