విహారం మాటున విషాదం

15 Jul, 2019 12:56 IST|Sakshi
జలపాతంలో జారిపడి మరణించిన పర్యాటకుడు (ఫైల్‌)

రక్షణ చర్యలు చేపట్టని అధికారులు

హెచ్చరికల బోర్డులు పట్టించుకోని పర్యాటకులు

ప్రమాదాలకు గురవుతున్న వైనం

విశాఖ ఏజెన్సీలోని జలపాతాలు మృత్యులోగిళ్లుగా మారుతున్నాయి.ఎంతో మందిని మింగేస్తున్నా రక్షణచర్యలు కానరావడం లేదు. పర్యాటకుల్లోఅవగాహన కరువవడం కూడా ఈ దుస్థితికి కారణం. తాజాగా జిల్లాలోని ‘సరియా జలపాతం’లో శనివారం ఓ యువకుడు జారిపడి మరణించాడు. 2015లోఇక్కడ మొదలైన మరణమృదంగం ఏ యేటికాయేడు పెరుగుతోంది.   – అనంతగిరి (అరకులోయ)

ప్రకృతి ఒడిలో ఆనందంగా గడిపిరావాలని.. ఒత్తిడికి దూరమవ్వాలనే కోరికతో విహారయాత్రలకు వచ్చే పర్యాటకులు చిన్నచిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 2015లో సరియా జలపాతం బాహ్య ప్రపంచానికి పరిచయం అయింది. కొద్దికాలంలోనే పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గడిచిన నాలుగేళ్లలో 10మంది వరకు ఇక్కడ మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రకృతి ఒడిలో..
సహజ సిద్ధమైన ప్రకృతి అందాల ఒడిలో ఈ జలపాతం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే దేవరాపల్లి నుంచి పెదగంగవరం మీదుగా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అడవిలో ప్రయాణం తరువాత సరియా జలపాతం వస్తుంది. చూసేందుకు జలపాతం అందంగా కనిపించినా ఈతకొట్టేందుకు అనువైన ప్రాంతం కాదని స్థానికులు, గైడ్లు చెబుతున్నారు. ఈత సరదాతోనే అధికశాతం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నీటిని చూసి ఆనందంతో ఈతకు దిగడం, ఆ హుషారులో ప్రమాదకర ప్రదేశాల్ని పట్టించుకోకపోవడంతో ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. కొందరైతే మద్యం సేవించి పట్టుతప్పి జలపాతంలోకి జారిపోతున్నారు.  

హెచ్చరికల్ని పట్టించుకోరు...
జీనబాడు పంచాయతీ అ«ధికారులు, స్థానిక నాయకుల సహకారంతో జలపాతం వద్ద హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు. జలపాతం సమీపంలోని రాళ్లపై కూడా రాయించారు. కొందరు పర్యాటకులు, విద్యార్థులు వీటిని ఖాతరచేయకుండా మొండిగా ముందుకు వెళ్లి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. తరచూ ప్రమాద ఘటనలతో ఈ జలపాతం వార్తాల్లోకి ఎక్కుతుంది.

సెల్ఫీల జోరు.. తీస్తోంది ఉసురు..
ఏజెన్సీలో జలపాతాల్ని సందర్శిస్తున్న పర్యాటకుల్లో ఉత్తరాంధ్రవాసులే అధికంగా ఉన్నారు. వీరిలో యువత ఎక్కువ. వీరంతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేందుకు జోరుగా ప్రవహించే నీటిలో సెల్ఫీలు దిగుతున్నారు. పరిసరాల్ని పట్టించుకోకుండా ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు.

జలపాత వీక్షణం.. జరభద్రం..

మీరు జలపాతాల్ని సందర్శించేందుకు వెళుతున్నట్లయితేముందుగా ఆ ప్రాంతంపై అవగాహన పెంచుకోండి.
స్థానిక గైడ్‌ల సూచనల్ని కచ్చితంగా పాటించండి.
నాచు ఎక్కువగా ఉండే ప్రాంతాల విషయంలో జాగ్రత్త.
లోతైన ప్రాంతాలు, ఊబిలు, ప్రమాదకర ప్రవాహాల మలుపులు,
పెద్దసైజులో ఉండే రాళ్లు విషయంలో జాగ్రత్త.
హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా చదవండి. సూచనల్ని పాటించండి.
సెల్ఫీలు, ఫొటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి జలపాతాల వద్దకు వెళ్లకండి.
ఈతకొట్టడం, ఎత్తైన ప్రదేశాల నుంచి నీటిలోకి దూకడం వంటివి చేయొద్దు.

రక్షణ చర్యలు తీసుకున్నాం...
జలపాతం వద్ద రక్షణ చర్యల్లో భాగంగా గతంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక గిరిజనులు గైడ్‌లుగా వ్యవహరించి ఈ ప్రాంతం మీద అవగాహన కల్పిస్తుంటారు. ప్రమాదకరమైన ప్రదేశాలను ముందుగానే వివరిస్తున్నారు. అయినా సరే కొంతమంది పర్యాటకులు మొండిగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.– సుధాకర్, అనంతగిరి ఎస్‌ఐ

మృత్యుఘటనలివే..  2015
కోటరువురట్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పంచార్ల నానీ (19), విశాఖ జిల్లా వాంబేకాలనీకి చెందిన ఆకాష్‌ హేమ సుందర్‌(22)లు ఇక్కడ రాయిమీద నుంచి జారిపడి మృత్యువాతపడ్డారు
2016
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఒడ్డుపేట గ్రామానికి చెందిన ఎం.సంభుల్‌(50) అనే విశ్రాంత ఉద్యోగి కాలుజారి మరణించారు  
విశాఖ జిల్లా దొండపర్తికి చెందిన నందిక మురళి (28) ఈతకొట్టేందుకు దిగి జలపాతంలో మునిగి చనిపోయాడు
విశాఖ జిల్లా సబ్బవరం మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన లోవరాజు (20) ఈతకు దిగి మరణించాడు
2017
విశాఖ జిల్లా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉల్లంగి వెంకటరావు (52) జలపాతంలోకి దిగి మృతి చెందారు
అనకాపల్లి మండలం గవరపాలెంకు చెందిన వై. నాగశివకుమార్‌ (20) ఈతకు దిగితే మృత్యువు కాటేసింది
2018
విశాఖ ప్రాంతానికి చెందిన పార్థసారథి(25) జలపాతం వద్ద కాలు జారి పడి మృతి చెందాడు. ఇవి పోలీస్‌ లెక్కల్లో ఉన్నవి మాత్రమే. వెలుగులోకి రాని మరణాలు చాలా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు